ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  కడప ఉక్కు ప్యాక్టరీ నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. దీని ద్వారా విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించినా... తాము ముందుకు తీసుకెళుతున్నామనే సంకేతాలను చంద్రబాబు ఏపి ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చంద్రబాబు భావించారు. అయితే ఆయన ఆలోచనను గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఏపి ప్రభుత్వాన్నే ఇరకాటంలో పెడుతూ కడప ఉక్కు ప్యాక్టరీపై సంచలన ప్రకటన చేసింది.

కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం తమకు అందించలేదని కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ప్రకటించింది. ముడి  పదార్ధాల లభ్యత, గనులకు సంబంధించిన ఉన్నత స్థాయి టాస్కో పోర్స్ ఏర్పాటు చేసినట్లు కేంద్రం గుర్తుచేసింది. దీని ద్వారా ఎన్నిసార్లు వివరాలు కోరినా రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన లేకుండా పోయిందని వెల్లడించింది. 

మరో వైపు కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యపడదని సెయిల్‌ నివేదిక ఇచ్చిందని ఉక్కు మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. సాద్యాసాధ్యాలను పరిశీలిస్తుండగానే ఏపి సీఎం అనాలోచిత నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు.  

కేంద్ర ప్రభుత్వం కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం చిత్తశుద్దితో పనిచేస్తోందని బిజెపి నాయకులు పేర్కొన్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌ కూడా ఏపికి చెందిన వివిధ పార్టీల ప్రజాప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారని వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని బిజెపి నాయకులు పేర్కొన్నారు.