న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరోషాక్ ఇచ్చింది కేంద్రప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో ఆరోపించింది. 

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం విషయంలో అక్రమాలు జరిగాయని సీబీఐ విచారణ చేయిస్తారా అంటూ వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి ప్రశ్నపై జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ క్లారిటీ ఇచ్చారు.

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం, పునర్నిర్మాణంలో అవకతవకలపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. అయినా సీబీఐ విచారణకు ఆదేశించడం ఎందుకు అంటూ ప్రశ్నించారు. 

ఒకవేళ పోలవరం ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరిగితే రాష్ట్రప్రభుత్వమే విచారించాలని సూచించారు. పునరావాసం, గిరిజనుల సమస్యలను రాష్ట్రప్రభుత్వమే పరిష్కరించాలని సూచించారు. 

పోలవరం ప్రాజెక్టు విషయంలో కలెక్టర్ స్థాయి అధికారితో విచారణ జరిపించి నివేదిక అందజేయాలని సూచించారు. ఇకపోతే గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి పునరావాసానికి సంబంధించి కేంద్రం స్థాయిలో కమిటీ ఉంటుందని ఆ కమిటీ త్వరలోనే నివేదిక అందజేస్తుందని తెలిపారు. 

మరోవైపు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించిందని అందులో భాగంగా నిధులు కూడా ఇప్పటికే పలు దఫాలుగా విడుదల చేసినట్లు తెలిపారు. ప్రాజెక్టకు సంబంధించి నిధులు 90శాతం కేంద్రమే భరిస్తుందని ఆర్థిక సంఘం సూచించలేదని స్పష్టం చేశారు. అయితే ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కేంద్రప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు.