ప్రజాప్రాతినిధ్య చట్ట సవరణకు మంత్రిమండలి ఆమోదం ఈ చట్టం ప్రవాస భారతీయుల అనుకూలం ఎన్నికల సంస్కరణలకోసమేనన్న ప్రభుత్వం

ఇక ప్రవాస భారతీయులు తమకు నచ్చిన నాయకులకు ఓటేయవచ్చు. అదీ ఇండియాకు రాకుండానే. ఈ విధంగా వారికి వెసులుబాటు కల్పించనుంది ఎన్నికల కమీషన్. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రానున్న పార్లమెంట్ సమావేశాల్లో చట్ట సవరణ చేయనుంది. దీని ద్వారా ప్రవాసులు నివసిస్తున్న దేశం నుంచే ఓటింగ్‌లో పాల్గొనేందుకు అనుమతివ్వనున్నారు.
 ఇప్పుడున్న చట్టాల ప్రకారం విదేశాల్లో ఉంటున్న భారతీయులు ఓటేయాలంటే నా నా అవస్థలు పడుతున్నారు. స్వదేశానికి వస్తే గాని తమ ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నారు. అలాగని తమ పనుల్ని వదులుకుని వచ్చి ఓటేసేవారు చాలా తక్కువ. వారందరినీ ఎన్నికల్లో భాగస్వాములను చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం వారు విదేశాల నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణ చేయాలనుకుంటున్నారు.


ప్రవాసుల్లో మోదీకి ఉన్నఆదరణను ఓట్ల రూపంలోకి మార్చడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది.. ఇందుకోసమే కేంద్ర మంత్రి మండలి సమావేశంలో హుటాహుటిన నిర్ణయం తీసుకున్నారు.


త్వరలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న ఈ చట్టం ద్వారా ఎన్నికల సంస్కరణలకు నాంది పలకనున్నట్లు కేంద్ర సర్కారు హామీ ఇచ్చింది.
గతంలో జరిగిన ఎన్నికల్లో ప్రవాస భారతీయులు చాలా తక్కువ మంది పాల్గొన్నారని అటార్నీ జనరల్ వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. వారిని భాగస్వాములను చేయడానికే ఈ చట్ట సవరణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే చట్ట సవరణకు కాస్త సమయం పట్టవచ్చని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనానికి ప్రభుత్వం తరపున వివరించారు.