Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో ఒకేసారి ఎన్నికలు, ఈవీఎంలపై అనుమానాలొద్దు: సిఈసీ సునీల్ అరోరా


అలాగే మహిళా ఓటర్లకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయని వాటిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు తెలిపారు. ఫిర్యాదులు వచ్చిన చోట్ల ర్యాండమ్ ఆడిట్ చేయాలని నిర్ణయించినట్లు సిఈసీ అన్నారు. 
 

cec sunil arora meets ap party leaders
Author
Amaravathi, First Published Feb 12, 2019, 5:27 PM IST

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు ఒకేరోజు జరుగుతాయని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్‌ అరోరా స్పష్టం చేశారు. మంగళవారం అమరావతిలో రాష్ట్రంలోని అన్ని పార్టీల ప్రతినిధులతో రెండో రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీల ప్రతినిధుల నుంచి అభ్యంతరాలపై చర్చించారు. 

ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని, ఒక్కరికే రెండు, మూడు ఓట్లున్నాయన్న విషయం తమ దృష్టికి వచ్చిందని సునీల్ అరోరా తెలిపారు. కొన్ని పార్టీలు రేషన్‌ కార్డులు, పెన్షన్లు ఇచ్చేటప్పుడు ప్రమాణాలు చేయించుకుంటున్నట్లు ఫిర్యాదులు కూడా అందాయన్నారు. 

అలాగే మహిళా ఓటర్లకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయని వాటిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు తెలిపారు. ఫిర్యాదులు వచ్చిన చోట్ల ర్యాండమ్ ఆడిట్ చేయాలని నిర్ణయించినట్లు సిఈసీ అన్నారు. 

ఎన్నికల దృష్టిలోనే కొన్ని బదిలీలు జరిగాయని ఫిర్యాదులు అందాయని ఆ విషయంపై సీఎస్‌, డీజీపీలతో చర్చించినట్లు తెలిపారు. నివేదిక ఇచ్చిన తర్వాత వాటిపై విచారణ జరిపుతామని హామీ ఇచ్చారు. ప్రస్తుత డీజీపీపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని వస్తే పరిశీలిస్తామని తెలిపారు. 

ఈవీఎంలు దుర్వినియోగం అయిన అంశం ఇప్పటి వరకు తన దృష్టికి రాలేదన్నారు. ఈవీఎంలపై ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్‌ జరగడం అసాధ్యమని చెప్పుకొచ్చారు. 

దాదాపు అన్ని పార్టీలు ఈవీఎంలపై సంతృప్తి వ్యక్తం చేశాయని అయితే కొన్ని పార్టీలు మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయన్నారు. ఆర్టీజీస్ ద్వారా జరిగిన సర్వే అంశాన్ని ఏపీ ఎన్నికల అధికారి పరిశీలించి విచారణ చేస్తారని చెప్పారు. కులాల ఆధారంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం కుదరదని సిఈసీ సునీల్ అరోరా స్పష్టం చేశారు.. 
 

Follow Us:
Download App:
  • android
  • ios