న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల కేసు... వైసిపి మాజీ ఎమ్మెల్యే ఆమంచికి సిబిఐ నోటీసులు
అధికార పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు సిబిఐ మరోసారి నోటీసులు అందించింది. గతంలో న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై సిబిఐ విచారణకు హాజరైనా మళ్ళీ ఇదే కేసులో విచారణకు పిలిచారు.
బాపట్ల: వైసిపి నేత, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు సీబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. న్యాయ వ్యవస్థలను గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వడానికి ఈ నెల 22న తమ ఎదుట హాజరుకావాల్సిందిగా ఆమంచికి అందించిన నోటీసుల్లో సిబిఐ పేర్కొంది. ఈ మేరకు CRPC సెక్షన్ 41(A) కింద నోటిసు జారీచేసింది.
గతేడాది ఆరంభంలో వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడమే కొందరు జడ్జీలు పనిగా పెట్టుకున్నారంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేసారు. న్యాయమూర్తులను దూషిస్తూ, వారిని ముక్కలుగా నరకాలంటూ తీవ్ర వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో ఇలా సోషల్ మీడియాలో న్యాయవ్యవస్థను కించపరుస్తూ, జడ్జిలను బెదిరించేలా పోస్టులు పెట్టినవారిపై కేసులు నమోదయ్యాయి.
వైసీపీ నేతలు న్యాయవ్యవస్థను కించపర్చేలా విమర్శలు చేశారని కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంలో రాష్ట్ర పోలీసుల విచారణ తీరుపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.
ఈ విషయమై గత ఏడాది నవంబర్ మాసంలో 16 మందిపై కేసులు నమోదు చేసింది సీబీఐ. గతంలో సీఐడీ నమోదు చేసిన కేసులను యథాతథంగా నమోదు చేసినట్టుగా సీబీఐ తెలిపింది. ఐటీ సెక్షన్లలోని 154, 504, 505 సెక్షన్ల ప్రకారంగా సీఐడీ నమోదు చేసిన 12 ఎఫ్ఐఆర్ ను ఒకే కేసుగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నట్టుగా సీబీఐ ప్రకటించింది.
ఈ క్రమంలోనే న్యాయస్థానాలపై అనుచితమైన పోస్టులను సోషల్ మీడియాలో పెట్టారనే అభియోగాలపై ఆమంచి కృష్ణమోహన్ కు సిబిఐ నోటీసులు ఇచ్చింది. దీంతో ఆయన సిబిఐ విచారణకు కూడా హాజరయ్యారు. అయితే మళ్లీ ఇప్పుడు సిబిఐ ఆమంచికి నోటీసులు జారీచేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.