మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఉదయ్‌కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను సీబీఐ ప్రస్తావించింది.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం ఉదయ్ కుమార్‌ను పులివెందులలోని ఆయన నివాసం నుంచి సీబీఐ అధికారులు మొదటగా విచారణ నిమిత్తం కడపలోని జైలు గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఉదయ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఉదయ్‌కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను సీబీఐ ప్రస్తావించింది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఉదయ్ కుమార్ అత్యంత సన్నిహితుడని వెల్లడించింది.
‘‘వివేకా హత్య కేసులో ఆధారాలు చెరిపివేసేందుకు ఉదయ్ కుమార్ రెడ్డి ప్రయత్నించాడు. ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు కలిసి ఘటనాస్థలంలో ఆధారాలను తారుమారు చేసేందుకు యత్నించారు. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు ఉదయ్ కుమార్ ఉదయం 4 గంటలకు అతడి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు.
వివేకా హత్య జరిగి చోట ఉన్న ఆధారాలను ఉదయ్ చెరిపేశారని చెప్పేందుకు సాక్ష్యాలు ఉన్నాయి. బాత్ రూమ్ నుంచి వివేకానందరెడ్డి మృతదేహాన్ని ఉదయ్ కుమార్ బయటకు తీసుకొచ్చాడు. వివేకానందరెడ్డి తలకు ఉన్న గాయాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించాడు. తన తండ్రి ప్రకాష్ రెడ్డితో వివేకా మృతదేహానికి కుట్లు వేయించారు. గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలతో కలిసి ఉదమ్ కుమార్ ఆధారాలను చెరిపేశారు.
వివేకా హత్య రోజు తెల్లవారుజామున అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉదయ్ కుమార్ ఉన్నారు. శివశంకర్ రెడ్డి కూడా అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు. హత్య గురించి తెలియగానే ఆధారాలు చెరిపివేసేందుకు సిద్దమయ్యారు. అనినాష్‌కు శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసి వివేకానందరెడ్డి చనిపోయినట్టుగా సమాచారం అందజేశారు. అవినాష్ ఇంట్లో శివశంకర్ రెడ్డి, ఉదయ్, భాస్కర్ రెడ్డి ఉన్నట్టుగా గుర్తించాం. గూగుల్ టేకౌట్ ద్వారా దీనిని గుర్తించాం’’ అని సీబీఐ పేర్కొంది.
ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని తెలిపింది. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని చిత్రీకరించేందుకు ప్రయత్నం జరిగిందని సీబీఐ పేర్కొంది. ఉదమ్ కుమార్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని.. పారిపోతాడనే ఉద్దేశంతోనే అతడిని అరెస్ట్ చేసినట్టుగా తెలిపింది. వివేకా హత్య కేసులో దర్యాప్తు జరుగుతుందని పేర్కొంది.
