అమరావతి: సున్నపురాయి తవ్వకాలపై నమోదైన 17 కేసులపై దర్యాప్తు జరుపుతున్న సిబిఐ అధికారులు  టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరుల నివాసాలపై గురువారం దాడులు జరిపింది. హైదరాబాద్ లోని యరపతినేని నివాసంతో పాటు గుంటూరు జిల్లాలోనే పలు ప్రాంతాల్లో సిబిఐ  సోదాలు జరిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను సిబిఐ డిల్లీ కార్యాలయం వెల్లడించింది. ఈ సోదాల్లో కొన్ని కీలక పత్రాలు, మొబైల్‌ ఫోన్లు, సామగ్రి, నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.      

టిడిపి ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్, క్వారీ తవ్వకాలు, విలువైన సున్నపురాయిని మోసపూరితంగా తరలించడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారంటూ యరపతినేనితో పాటు ఆయన అనుచరులపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై దర్యాప్తును వేగవంతం చేసిన సిబిఐ తాజాగా ఇళ్లు, కార్యాలయాల్లో దాడులకు దిగింది. 

ఇక మైనింగ్ లో జరిగిన అక్రమాలను గుర్తించేందుకు సిబిఐ శాటిలైట్ చిత్రాలను ఉపయోగిస్తోంది. మైనింగ్ కు ముందు, ఆ తర్వాత శాటిలైట్ చిత్రాలను సాంకేతిక పద్దతిలో పరిశీలించి ఎంతమేర అక్రమ మైనింగ్ జరిగిందన్నది తేల్చాలని సిబిఐ భావిస్తోంది. ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది సిబిఐ.