సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన పోటీపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన పోటీపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్టుగా స్పష్టం చేశారు. అయితే తాను ఏ పార్టీ నుంచి బరిలో నిలుస్తాననేది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. తన ఆలోచనలనకు అనుగుణమైన పార్టీ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. లేకపోతే స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తన రాజకీయ భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. 

సీబీఐ జేడీగా గుర్తింపు పొందిన వీవీ లక్ష్మీనారాయణ.. ఆ తర్వాత ప్రజాసేవలోకి రావాలనే ఆలోచనతో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 2018లో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా లక్ష్మీనారాయణ ప్రకటన చేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు ఆయన జనసేన పార్టీలో చేరారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచిన లక్ష్మీనారాయణ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొన్ని నెలలకే జేడీ లక్ష్మీనారాయణ జనసేనను వీడారు. ఆ సమయంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వైఖరిలో స్థిరత్వం లేదని లక్ష్మీనారాయణ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ‘‘పవన్ కళ్యాణ్ పూర్తి సమయం రాజకీయాలకు కట్టుబడి ఉంటానని.. మళ్ళీ సినిమాల్లో నటించనని ప్రతిజ్ఞ చేశారు. కానీ ఆయన తన వైఖరిని మార్చుకుని ఇటీవల ఒక సినిమా కోసం సైన్ చేశారు ఇది ఆయనకు స్థిరత్వం లేకపోవడం చూపించింది’’ అని అన్నారు. 

ఆ తర్వాత నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్న లక్ష్మీనారాయణ.. వివిధ సామాజిక కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. అయితే లక్ష్మీనారాయణ మళ్లీ రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే జేడీ లక్ష్మీనారాయణ.. 2024 ఎన్నికల్లో తాను విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని చెబుతూ వస్తున్నారు. అయితే ఆయన ఏదైనా పార్టీలో చేరతారా?, కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారా?, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తారా? అనే విషయాలపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.