కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  రికార్డుల కోసం సీబీఐ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును సీబీఐ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.

వివేకానంద రెడ్డి హత్య కేసులో  రికార్డులు ఇవ్వాలని పులివెందుల మేజిస్ట్రేట్ ను సీబీఐ కోరింది. అయితే ఈ రికార్డులు ఇవ్వడానికి పులివెందుల మేజిస్ట్రేట్ నిరాకరించాడు.ఈ రికార్డులు ఇవ్వాలని తమకు ఆదేశాలు లేవని మేజిస్ట్రేట్ చెప్పాడు. 

దీంతో ఈ కేసుకు సంబంధించిన రికార్డులను తమకు ఇవ్వాలని కింది కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టులో సీబీఐ సోమవారం నాడు పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇవాళ విచారించింది. విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

also read:వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు: సీబీఐ సంచలన నిర్ణయం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ బాధ్యతను ఢిల్లీ ప్రత్యేక నేరాల విభాగానికి చెందిన 3వ బ్రాంచీకి అప్పగిస్తూ ఈ ఏడాది అక్టోబర్ 15న నిర్ణయం తీసుకొన్నారు. 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసు విచారణ అధికారిగా డీఎస్పీ దీపక్ గౌర్ ను నియమించింది. ఐపీసీ 302 ప్రకారంగా సీబీఐ కేసును రీ రిజిస్ట్రేషన్ చేసింది.

ఈ కేసు విచారణ కోసం కొత్త సీబీఐ బృందం కడపకు వచ్చింది. తొలుత వివేకా హత్య కేసును సీఆర్‌పీసీ 174 సెక్షన్ కింద అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సీబీఐ మార్పులు చేసింది. త్వరలోనే  స్పెషల్ టీమ్ దర్యాప్తును ప్రారంభించనుంది.