గుంటూరు అర్బన్‌ పోలీసులపై సీబీఐ కేసు నమోదయ్యింది. నల్లబోలు సునీత, రాయిది నాగలక్ష్మి, తుమ్మటి విజయలక్ష్మి అనే ముగ్గురు మహిళలు తమ భర్తలను అక్రమంగా పోలీసులు నిర్బంధించారంటూ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల నిర్బంధం నుండి తమవారిని విడిపించాలంటూ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.  

అయితే మహిళల భర్తల నిర్బంధంపై పోలీసులు కౌంటర్‌ దాఖలుచేశారు. పోలీసుల కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తం చేసింది హైకోర్టు. దీంతో గుంటూరు సీసీఎస్ పోలీసుల పాత్రపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. ఏపీ హైకోర్టు ఆదేశాలతో పోలీసులపై కేసు నమోదు చేసింది సీబీఐ.

ఈ వ్యవహారంపై ఇకపై సిబిఐ విచారణ జరగనుందన్న మాట. పోలీసులు నిజంగానే సదరు మహిళల భర్తలను నిర్బంధించినట్లు నిర్దారణ అయితే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. అక్రమంగా నిర్బంధించడమే కాకుండా కోర్టును తప్పుదోవ పట్టించేలా కౌంటర్ దాఖలు చేసినట్లు బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బాధిత మహిళలు తెలిపారు.