విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల నేతలు ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. 

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల నేతలు ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పురోగతిలో ఉందని కేంద్రం చేసిన తాజా ప్రకటనపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టీల్‌ప్లాంట్‌ గేట్‌ నుంచి సింహాచలం వరకు పాదయాత్రకు నిర్వహించారు. ఈ పాదయాత్రకు పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. పాదయాత్రలో పాల్గొన్నవారంతా.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పాదయాత్రలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన సంచలన ప్రకటన చేశారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఈరోజు చేపట్టిన పాదయాత్ర ట్రైలర్ మాత్రమేనని చెప్పారు. అసలు సినిమా ముందు చూపిస్తామని అన్నారు. కేంద్రం విధానం ప్రైవేటీకరణ అయితే ప్రజలు ఎలా తిప్పికొడతారో చూపిస్తామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ఈవోఐ‌లో పాల్గొనబోతున్నట్టుగా చెప్పారు. స్టీల్ ప్లాంట్ బాగుండాలని కోరుకునే వారిలో తాను కూడ ఒకరినని తెలిపారు. ప్రజల మద్దతు, సహకారంతో ఈవోఐ వేయబోతున్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత మీటింగ్‌లలో తాము మాట్లాడబోతున్నామని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తుల కబంధ హస్తాల్లోకి స్టీల్ ప్లాంట్‌ వెళ్లకూడదనే తమ ఆకాంక్ష అని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ వేస్తుందని అనుకుంటామని.. ఈరోజు సాయంత్రం వరకు చూద్దామని చెప్పారు. 

ఇక, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగలేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ప్రస్తుతం ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే విశాఖపట్నంలో గురువారం తన పర్యటన సందర్బంగా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే మరుసటి రోజే.. ఆర్‌ఐఎన్‌ఎల్ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియపై ఎటువంటి స్తంభన లేదని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్పొరేట్ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్)‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పురోగతిలో ఉందని తెలిపింది. ఆర్‌ఐఎన్‌ఎల్ పనితీరును మెరుగుపరచడానికి, దానిని నిలబెట్టడానికి కంపెనీ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ప్రభుత్వం మద్దతు ఇస్తుందని పేర్కొంది.