జగన్, విజయసాయిరెడ్డికి రిలీఫ్: విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి
విదేశాలకు వెళ్లేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు , విజయసాయి రెడ్డికి సీబీఐ కోర్టు అనుమతిని ఇచ్చింది.
హైదరాబాద్: విదేశాలకు వెళ్లేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు అనుమతిని ఇచ్చింది.ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో యూకే పర్యటనకు వెళ్లాలని సీఎం జగన్ ప్లాన్ చేసుకున్నారు.
ఈ మేరకు కోర్టులో అనుమతి కోరారు. ఈ ఏడాది సెప్టెంబర్ 2 నుండి 12వ తేదీ వరకు జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతిని ఇచ్చింది. యూకేలో ఉన్న తన కూతుళ్లను చూసేందుకు వెళ్లేందుకు అనుమతివ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కోర్టును అనుమతిని కోరారు. కుటుంబ సమేతంగా యూకే పర్యటనకు వెళ్తున్నట్టుగా కోర్టుకు ఆయన తెలిపారు.యూకే వెళ్లేందుకు అనుమతివ్వాలని ఆయన కోరారు. యూకే, యూఎస్ఏ, దుబాయ్, సింగపూర్ లలో పర్యటించేందుకు అనుమతించాలని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కోర్టును కోరారు. విజయసాయిరెడ్డికి కూడ కోర్టు అనుమతిని ఇచ్చింది. ఆయా దేశాలకు చెందిన యూనివర్శిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉందని విజయసాయి రెడ్డి కోర్టును కోరారు.
ఈ నెల 28వ తేదీన సీఎం జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అదే రోజున విజయసాయి రెడ్డి కూడ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఇద్దరిపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే.ఈ కేసులు విచారణ దశలో ఉన్నాయి. కొన్ని కేసుల్లో వీరిద్దరికి బెయిల్ లభించింది.