టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్లు నేడు హైకోర్టులో విచారణకు రానున్నాయి. మొద్దు శీను హత్యోదంతాన్ని చంద్రబాబు తరఫు న్యాయవాదులు తెరపైకి తెచ్చారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై పెట్టిన మూడు కేసుల విషయంలో నేడు (మంగళవారం) హైకోర్టులో విచారణ జరగనుంది హైకోర్టు ఏ విధమైన నిర్ణయం వెల్లడిస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అది నేడు విచారణకు రానుంది.
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అవకతవకలు జరిగాయంటూ చంద్రబాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరగనుంది.ఈ మూడు కేసుల్లోనూ హైకోర్టు ఏ విధమైన నిర్ణయం ప్రకటిస్తుందనే ఉత్కంఠ నెలకొని ఉంది.
చంద్రబాబును ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను కొట్టివేయాలంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. కాగా, చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్, జనరల్ బెయిల్ ఇవ్వాలంటూ విజయవాడ ఎసిబి కోర్టు చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఐదు అంశాలను వాళ్లు లేవనెత్తారు.
జైలులో చంద్రబాబు ఆహారం సరిగా తీసుకోవడం లేదని, చంద్రబాబుకు భద్రత లేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. జైలులో హత్యలు జరిగే ప్రమాదం ఉందని వారు అభిప్రాయపడ్డారు. పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మొద్దు శీనును జైలులో హత్య చేసిన విషయాన్ని వారు ఉదహరించారు.
స్కిల్ డెవలప్ మెంటు కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయన రాజమండ్రి జైలులో ఉన్నారు. ఆయన జైలులో ఉండడం నేటికి పదో రోజు.
ఇదిలా వుంటే, ఢిల్లీలోని రాజ్ ఘాట్ ను టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్లమెంటు సబ్యులు, మాజీ ఎంపీలు సందర్శించారు. మహాత్మగాంధీకి వారు నివాళులు అర్పించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా వారు ఢిల్లీ వేదికగా ఆందోళనలు చేస్తున్నారు.