విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లా పరవాడలోని సాయినార్ కంపెనీలో బాయిలర్ గ్యాస్ లీక్ తో చోటు చేసుకొన్న ప్రమాదంపై  కేసు నమోదు చేసినట్టుగా సీపీ ఆర్ కె మీనా తెలిపారు.  ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

విశాఖపట్టణం జిల్లాలోని ఎల్జీపాలీమర్స్ లో గ్యాస్ లీకైన  12 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను మరువకముందే  పరవాడలోని సాయినార్ కంపెనీలో బాయిలర్ గ్యాస్ లీకైన ఘటనలో ఇద్దరు మరణించడంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

సాయినార్ కంపెనీలో బాయిలర్ లో గ్యాస్ లీకైన విషయం తెలిసిన వెంటనే తాము ఘటన స్థలానికి చేరుకొన్నట్టుగా మీనా తెలిపారు. ఈ కంపెనీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందితే, మరో నలుగురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా సీపీ మీడియాకు తెలిపారు. 

మృతుల్లో షిఫ్ట్ ఇన్‌చార్జ్ నరేంద్ర గుంటూరు జిల్లా తెనాలి వాసి. మరో కెమిస్ట్ గౌరీశంకర్ విజయనగరానికి చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. మూడేళ్ల క్రితం ఇదే సంస్థలో రియాక్టర్ పేలి ఇద్దరు మరణించారు. గతంలో జరిగిన ప్రమాదంపై కూడ విచారణ చేస్తున్నామని సీపీ తెలిపారు.