అనంతపురం: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీద అనంతపురం జిల్లా డీ.హీరేలాల్ పోలీసు స్టషన్ లో కేసు నమోదైంది.

కర్ణాటకలో టీడీపీ కార్యకర్తపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ దాడిని రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి అంటగడుతూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. దానిపై రాష్ట్ర ఎస్ సెల్ కార్యదర్శి భోజరాజు నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే గౌరవానికి భంగం వాటిల్లే విధంగా లోకేష్ వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. 

ఆ ఫిర్యాదు మేరకు నారా లోకేష్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. 111/2021  సెక్షన్ల కింద ఆయన కేసు నమోదైంది. ఆయనపై 153(ఎ), 505, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

కర్నూలులో కరోనా వేరియంట్ మీద వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు మీద కేసు నమోదైన విషయం తెలిసిందే. చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తామని ఎస్పీ ఫకీరప్ప చెప్పారు.