హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మరో చిక్కులో పడ్డారు. ఆళ్లగడ్డ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె భర్త భార్గవ రామ్ మరో కేసులో ఇరుక్కున్నారు. ఆళ్లగడ్డ రూరల్ ఇన్ స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

భార్గవ రామ్ తన విధులకు ఆటంకం కలిగించారని, అరెస్టు చేయడానికి వచ్చిన తమను కారుతో ఢీకొట్టడానికి ప్రయత్నించారని ఆళ్లగడ్డ ఎస్ఐ రమేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. దాంతో గచ్చిబౌలి పోలీసులు ఆయనపై మంగళవారంనాడు ఐపిసి సెక్షన్లు 353, 336 కింద కేసు నమోదు చేశారు.  

ఓ కేసులో భార్గవ రామ్ ను పట్టుకునేందుకు ఆళ్లగడ్డ నుంచి పోలీసులు హైదరాబాద్ వచ్చారు. పోలీసులను చూసి భార్గవ రామ్ పారిపోయారు. కారును ఛేదించి పట్టుకునేందుకు ఆళ్లగడ్డ పోలీసులు ప్రయత్నించారు. దాంతో కారును భార్గవ రామ్ పోలీసులపైకి ఎక్కించడానికి ప్రయత్నించి పారిపోయారని ఎస్సై ఆరోపించారు.