కడప: కార్పోరేట్ కాలేజీ చదువులు, ర్యాంకుల పేరిట విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తాయన్న విషయం తెలిసిందే. ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఇప్పటికే చాలామంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. తాజాగా మరో విద్యార్ధి కూడా ఇలాగే ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. తన ఆత్మహత్యకు కాలేజీ ఒత్తిడి వల్లే చనిపోతున్నానంటూ సూసైడ్ లెటర్ రాసిపెట్టి మరీ చనిపోయాడు సదరు విద్యార్థి. 

వివరాల్లోకి వెళితే... కడప జిల్లా కోడూరు మండలం సిద్దుగారిపల్లె గ్రామానికి చెందిన నేలటూరి సుబ్బారెడ్డి-ప్రమీలమ్మ దంపతుల మూడో సంతానం శ్రీనివాసుల రెడ్డి(17). అతడు కడప పట్టణంలోని ఓ కార్పోరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే చదువు పేరిట సాగించే ఒత్తిడిని తట్టుకోలేక అతడు ఇటీవలే ఇంటికి వెళ్లాడు. అయితే అతడికి కాలేజీకి పంపించాలని కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులపై కూడా ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో తట్టుకోలేకపోయిన శ్రీనివాసులు దారుణ నిర్ణయం తీసుకున్నాడు. 

గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఆత్మహత్యకు కారణం కళాశాల యాజమాన్యమేనంటూ ఓ సూసైడ్ లెటర్ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. గతకొన్ని రోజులుగా వారు చేసిన ఒత్తిళ్లకు మానసికంగా ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సూసైడ్‌ నోట్‌ రాశాడు. ''నన్ను మీరు కని పెంచినందుకు క్షమించండి. ఐ మిస్‌ యూ అమ్మ.. మిస్‌ యూ నాన్న.. మిస్‌ యూ బ్రదర్స్‌..'' అంటూ సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సూసైడ్ లెటర్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.