Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ ని కలిసిన కెనడా కౌన్సిల్ జనరల్... పనితీరుపై ప్రశంసలు

భారత్‌తోపాటు ఏపీతో తమ బంధాన్ని మరింత దృఢం చేసుకునేందుకు వివిధ రంగాల్లో అవకాశాలను పరిశీలిస్తున్నామని, ఆమేరకు వ్యాపార సంబంధాలను పెంచుకునేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

Canada Council Members General Meet CM Jagan
Author
Hyderabad, First Published Mar 12, 2020, 7:34 AM IST

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ చేపడుతున్న కార్యక్రమాలను కెనడా కాన్సుల్‌ జనరల్‌ నికోల్‌గిరార్డ్‌ ప్రశంసించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ఆమె కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలను గుర్తించి ఆమేరకు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత తెలిపారు. స్మార్ట్‌ సిటీ, ఫార్మా రంగాలపై తమ ఆసక్తిని వ్యక్తంచేశారు. 

Canada Council Members General Meet CM Jagan

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌తో కెనడా కాన్సెల్‌జనరల్‌ నిలోల్‌ గిరార్డ్, కాన్సుల్‌ మరియు సీనియర్‌ ట్రేడ్‌ కమిషనర్‌ మార్క్‌ ష్రోటర్, ట్రేడ్‌ కమిషనర్‌ విక్రం జైన్‌ భేటీ అయ్యారు. భారత్, కెనడాల మధ్య చాలా సన్నిహిత సంబంధాలున్నాయని, వాణిజ్యాన్ని పెంచుకోవడంతోపాటు, క్లైమేట్‌ చేంజ్‌లపై కలిసి ఇప్పటికే పనిచేస్తున్నామని గిరార్డ్‌ వెల్లడించారు. 

Also Read బెదిరించలేదు, స్వచ్ఛంధంగానే వైసీపీలోకి: బాబుకు రామసుబ్బారెడ్డి కౌంటర్...

భారత్‌తోపాటు ఏపీతో తమ బంధాన్ని మరింత దృఢం చేసుకునేందుకు వివిధ రంగాల్లో అవకాశాలను పరిశీలిస్తున్నామని, ఆమేరకు వ్యాపార సంబంధాలను పెంచుకునేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అటు కెనడాలోనూ, ఇటు ఏపీలోకూడా ప్రభావవంతమైన నాయకత్వం దీనికి దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. 

ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ విద్యా, వైద్యం, ఆరోగ్య రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలపై పత్రికల్లో వస్తున్న కథనాలు చదివానంటూ వాటిని ప్రశంసించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఈ బాటలో నడుస్తుండడం అభినందనీయమన్నారు. దేశంలో, రాష్ట్రంలో సంస్థాగత పెట్టుబడులు, ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని గిరార్డ్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల గురించి సీఎంని అడిగి తెలుసుకున్నారు. 
విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయరంగాలే ప్రాధాన్యతగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు సీఎం వివరించారు. ఈ అంశాల్లో గడచిన 9 నెలల కాలంలో తీసుకొన్న చర్యలను వివరించారు. పేదరికం అనేది చదువులకు అడ్డు రాకుండా, పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి అమ్మ ఒడిని అమలు చేశామని, నాడు – నేడు కార్యక్రమాలతో స్కూళ్లు, జూనియర్‌కాలేజీలు, డిగ్రీకాలేజీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెడుతున్నామని... అంతిమంగా నిరక్షరాస్యతను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం వివరించారు. 

జీఈఆర్‌ రేష్యోను పెంచడానికి కృషిచేస్తున్నామన్నారు. మధ్యాహ్నం భోజన పథకంలో నాణ్యతనుకూడా పెంచామన్నారు. అమ్మ ఒడి ద్వారా 82 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరడం చాలా మంచి కార్యక్రమనని గిరార్డ్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాలను, సర్వీసులను డోర్‌ డెలివరీ చేయడానికి గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థల ద్వారా తీసుకొచ్చిన మార్పులను సీఎం వారికి వివరించారు. 

Canada Council Members General Meet CM Jagan

అవినీతి, పక్షపాతం లేకుండా పారదర్శకత కోసం ప్రభుత్వం ఈచర్యలు తీసుకుందన్నారు. ఒక గ్రామానికి వెళ్తే... గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలు, ఇంగ్లిషు మీడియంలో బోధించే పాఠశాలలతో ఒక చక్కటి వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నారు. వచ్చే 1–2 సంవత్సరాల్లో గ్రామ సచివాలయాల్లోనే భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మొదలుపెడుతున్నట్టు సీఎం వివరించారు. 

ఆస్పత్రుల్లో నాడు –నేడు, రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు, ఆరోగ్య ఉప కేంద్రాల ద్వారా 24 గంటల వైద్య సేవలు ఇవన్నీకూడా పెనుమార్పులకు నాందిపలుకుతాయని సీఎం అన్నారు. మంచి చదువులకోసం, ఆరోగ్యం కోసం కుటుంబాలు అప్పుల్లో  కూరుకుపోతున్నాయి, విద్య, ఆరోగ్యం కోసం ఎవ్వరూ కూడా ఆ ఊబిలోకి వెళ్లకుండా ప్రభుత్వం తరఫున అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. 

రైతు భరోసా కేంద్రాలు ఏవిధంగా పనిచేస్తాయో సీఎం సమగ్రంగా వివరించారు. రాష్ట్రంలో టైర్‌–1 సిటీ లేదని, అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖను అభివృద్ధిచేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రానున్న 10 సంవత్సరాల్లో హైదరాబాద్‌ స్థాయి లాంటి నగరాలతో పోటీపడేలా తీర్చిదిద్దుతామన్నారు.

 ఐటీ, అత్యాధునిక టెక్నాలజీ అభివృద్ధికోసం విశాఖతోపాటు సెంట్రల్‌ ఆంధ్రా, అనంతపురం, తిరుపతి ప్రాంతాల్లో ప్రత్యేక ప్రాంతాలను అభివృద్ధిచేస్తామని సీఎం వెల్లడించారు. సాగునీటి రంగంలో కూడా చేపడుతున్న పలు కార్యక్రమాలపై సీఎం వివరించారు. రాయలసీమ ప్రాంతంలో కరువు నివారణ చర్యలతోపాటు, గోదావరిలో వృథాగా పోతున్న సముద్రపు జలాలను కృష్ణాకు తరలించే భారీ ప్రాజెక్టు కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios