సీఎం జగన్‌కు చంద్రబాబు సూటి ప్రశ్న.. ‘కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్’.. ట్వీట్ వైరల్
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు.. సీఎం జగన్‌కు సోషల్ మీడియా వేదికగా సూటి ప్రశ్న వేశారు. కియా పరిశ్రమను తరలిస్తామని, ఆ పరిశ్రమకు ఇచ్చిన భూములకు ఎక్కువ ధరలు ఇవ్వాలని జగన్ గతంలో రెచ్చగొట్టాడని నారా లోకేశ్ తన యువగళం పాదయాత్రలో భాగంగా కియా పరిశ్రమ ముందుకు వెళ్లి అన్నారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలవా? అని జగన్‌ను చంద్రబాబు అడిగారు.
అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్ వైరల్ అవుతున్నది. కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నది. కియా పరిశ్రమను కేంద్రంగా చేసుకుని ఆయన సీఎం జగన్‌మోహన్ రెడ్డికి సూటిగా సవాల్ చేశారు. గతంలో కియా పరిశ్రమ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలను తిప్పికొడుతూ తాజాగా లోకేష్ సెల్ఫీ చాలెంజ్ చేస్తూ ఆ పరిశ్రమ వద్దకు వెళ్లిన మాట్లాడిన విషయాలను తెలిపే వీడియోను పోస్టు చేశారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బెంగళూరుకు వెళ్లుతూ ఈ పరిశ్రమ స్థలంలో ఆగి స్థానికులను రెచ్చగొట్టే పని చేశాడని టీడీపీ యువనేత లోకేశ్ అన్నారు. ఇష్టం లేకున్నా భూములు లాక్కుని తక్కువ ధరలే కట్టించి ఈ పరిశ్రమ కడుతున్నారని, ఇంకొన్నాళ్లు ఓపిక పట్టాలని జగన్ అంటున్న వీడియోను చంద్రబాబు ట్వీట్ చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కియా పరిశ్రమను ఇక్కడి నుంచి పంపించేస్తామని జగన్ అంటూ ఆ వీడియోలో కనిపించారు.
Also Read: బైక్‌ను కిలోమీటరు ఈడ్చుకెళ్లిన ట్రక్.. వ్యక్తి దుర్మరణం.. భార్య, కొడుకుకు స్వల్ప గాయాలు
ఇదిలా ఉండగా యువగళం పాదయాత్ర 55వ రోజున అంటే నిన్న టీడీపీ యువ నేత లోకేశ్ కియా పరిశ్రమ వద్దకు వెళ్లి సెల్ఫీ చాలెంజ్ చేశారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కియా పరిశ్రమకు ఇచ్చిన భూములకు ఎక్కువ ధరలు ఇవ్వాలని, వారికి న్యాయం చేయాలని రెచ్చగొట్టారని లోకేశ్ అన్నారు. అప్పుడు జగన్ ఈ పరిశ్రమను ఫేక్ పరిశ్రమ అన్నాడని పేర్కొన్నారు. ఇది ఫేక్ పరిశ్రమనా? వేలాది మందికి ఉపాధినిస్తున్న ఈ సంస్థ ఎలా ఫేక్ అవుతుందని ప్రశ్నించారు.
ఈ రెండు వీడియోలను కలిపి చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పగలవా? మిస్టర్ జగన్ అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.