వైసీపీ ఎంత మొత్తుకున్నా ఫిరాయింపులపై చర్యలు తీసుకునే ఛాన్సే లేదు.
వైసీపీ ఎంత మొత్తుకున్నా ఫిరాయింపులపై చర్యలు తీసుకునే ఛాన్సే లేదు. రాజ్యంగాన్ని, విలువలను తుంగలో తొక్కైనా సరే తమ పంతాన్ని నెగ్గించుకుంటామని నిసిగ్గుగా టిడిపి ప్రకటించుకుంటూటే ఫిరాయింపుల విషయంలో వైసీపీ ఎంత మొత్తుకున్నా ఉపయోగమే ఉండదు. ఫిరాయింపులపై చర్యలకు డిమాండ్ చేయటమంటే, ‘చెవిటివాడి ముందు శంఖం ఊది’నట్లే. ఆ విషయం ప్రతిపక్షానికి తెలీకుండా ఉంటుందా? ఏదో తన డ్యూటి తాను చేయాలని కాబట్టి, అధికారపార్టీపై ఒత్తిడి తేవాలి కాబట్టి పదే పదే ఫిర్యాదులు చేస్తోంది.

అందులో భాగంగానే బుధవారం కూడా వైసీపీ ఎంఎల్ఏలు స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిసారు. ఫిరాయింపులపై చర్యలకు డిమాండ్ చేసారు. ఫిరాయింపు రాజకీయాలకు వ్యతిరేకంగానే తాము అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించిన సంగతి అందరకీ తెలిసిందే. ఆ విషయాన్ని వైసీపీ ప్రకటించిన తర్వాత కూడా వంతల రాజేశ్వరిని టిడిపిలోకి లాక్కున్నారంటేనే అర్ధమవుతోంది చంద్రబాబునాయుడు ఎంతగా బరితెగించారో.

ఈ విషయంలో వైసీపీ చేయగలిగిందంతా చేస్తోంది. రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. హైకోర్టు, సుప్రింకోర్టుకు కూడా వెళ్ళింది. అయినా ఏ ఒక్కరిపైనా చర్యలు లేవు. వ్యవస్ధలో దేని పనిని దాన్ని చేయనిస్తే సమస్యలు ఇంత వరకూ రావు. ఫిరాయింపులను ప్రోత్సహించటానికి చంద్రబాబు ఎవరికి కావాల్సింది వారికి ముట్టు చెబుతున్నారు. కాంట్రాక్టులు, ప్యాకేజీలు, అప్పులుంటే తీర్చేయటం, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ప్లస్ ఎన్నికల ఖర్చులు..ఇలా ఎవరి డిమాండ్లను తగ్గట్లుగా వారికి హామీ ఇస్తున్నారు కాబట్టే వైసీపీ నుండి టిడిపి వైపు ఫిరాయిస్తున్నారు.
ఒకవైపు ఫిరాయింపుల్లో ‘తలకు’ ఇంత అని కోట్లలో ఖరీదులు కడుతూ కూడా పెరిగిపోతున్న ఎన్నికల ఖర్చులను అరికట్టాలని, ప్రజా జీవితంలో విలువలు పాటించాలని, చేసే పనిలో పారదర్శకత ముఖ్యమని, నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ లెక్షర్లు దంచటం ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ కే చెల్లింది.
