గండికోట ప్రాజెక్టు విషయంలో నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంపై చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేయకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గండికోట ప్రాజెక్టు విషయంలో నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంపై చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేయకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే పోలీసులను పంపి వస్తు సామగ్రిని జప్తు చేస్తామంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇదేవిధంగా ఏ నిర్మాణ సంస్థయినా నిర్ధేశిత సమయానికి ప్రాజెక్టులు పూర్తిచేయకపోతే ఉపేక్షించేది లేదని కూడా తీవ్రంగా హెచ్చరించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు త్వరలోనే ప్రారంభోత్సవం చేస్తానని, కొండవీటివాగు డిసెంబరులోగా పూర్తిచేయాలని ఆదేశించారు.
ఏంటి అదంతా నిజమే అనుకుంటున్నారా? ఎందుకంటే, గండికోట పనులు సరిగా జరగటం లేదన్నది వాస్తవం. అయితే, పనులు ఇపుడు కాదు ఎప్పటి నుండో సరిగా జరగటం లేదు. మరి, చంద్రబాబు ఇపుడే ఎందుకు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆ విషయమే ఎవరికీ అర్దం కావటం లేదు. ఎందుకంటే, గండికోట ప్రాజెక్ట పనులు చేస్తున్నది సిఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్ధ. సిఎం రమేష్ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రిత్విక్ ప్రాజెక్ట్స్ వేల కోట్ల విలువైన పనులను దక్కించుకున్నది. అయితే, ఏ పనినీ సక్రమంగా చేయటం లేదు. ఆ విషయాలన్నీ చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా ఏనాడూ పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. అటువంటిది ఒక్కసారిగా రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్దపై చర్యలు తీసుకుంటానని చంద్రబాబు చెబితే ఎవరన్నా నమ్ముతారా?
సరే, పోలవరం పనులను లక్ష్యం మేరకు 2019లోగా పూర్తి చేయాలంటే 60-సీ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. దీనిపై ఒకటో తేదీన జరిగే మంత్రిమండలి సమావేశంలో మరింత వివరంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారట. ఉభయగోదావరి జిల్లాల్లో పునరావాసం కోసం చేపట్టిన పనుల గురించి ప్రస్తావిస్తూ, గిరిజన ప్రాంతాలలోని యువతీ యువకులకు ఉపాధి కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నట్టు తెలిపారు.
