కడప: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మీద వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత సి. రామచంద్రయ్య తీవ్రంగా మండిపడ్డారు. రెండు లక్షల కోట్ల ఆస్తులు పోతాయని చంద్రబాబు అమరావతి ఆందోళన చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబును మించిన అబద్ధాలు చెప్పే వ్యక్తి మరొకరు ఉండరని ఆయన అన్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద వ్యక్తిగత ద్వేషంతోనే చంద్రబాబు ప్రజల సమస్యలను జోడించి రెచ్చగొడుతున్నారని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన వల్ల రైతులకు ఏ విధమైన నష్టం ఉండదని ఆయన అన్నారు. చంద్రబాబు వాస్తవాలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

పబ్బం గడుపుకోవడానికి చంద్రబాబు ధర్నాలు చేస్తున్నారని, చంద్రబాబు ఏం చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలోలేరని ఆయన అన్నారు. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇన్ సైడ్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు వేల కోట్లు దండుకున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్ జగన్ నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత చంద్రబాబు కృత్రిమ ఉద్యమాలు చేస్తున్నారని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో దారుణంగా పోస్టింగులు పెడుతున్నారని ఆయన అననారు. 

పవన్ కల్యాణ్ ను రామచంద్రయ్య పెయిడ్ ఆర్టిస్ట్ గా అభివర్ణించారు. చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమరావతి రైతులను దురుద్దేశంతోనే రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. 

రాష్ట్ర పరిస్థితులను అన్ని రకాలుగా పరిశీలించి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో శివరామకృష్ణన్ నివేదిక ఇచ్చారని, ఆ నివేదిక రాక ముందే చంద్రబాబు బినామీ నారాయణ నివేదికను ఆధారం చేసుకుని రాజధాని ప్రకటన చేశారని ఆయన అన్నారు. 

అమరావతి రాజధాని వద్దని అప్పట్లో చంద్రబాబు అనుకూల మీడియాలోనే వార్తలు రాశారని, శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై చర్చించాలని పలు మార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆయన అన్నారు. 

బిజెపికి, టీడీపీకి మధ్య బ్రోకర్ లా పవన్ కల్యాణ్ తయారయ్యారని సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వంపై చాడీలు చెప్పడానికి పవన్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని తెలిసిందని, దీన్ని విన్న బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా తమకు అన్నీ తెలుసునని చెప్పినట్లు కూడా తమకు సమాచారం ఉందని ఆయన అన్నారు. 

పాచిపోయిన లడ్డూ ఇచ్చారన్న పవన్ కల్యాణ్ ఎందుకు యూటర్న్ తీసుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు నేరుగా బిజెపిని సంప్రదించకుండా పవన్ వంటివారి చేత మధ్యవర్తిత్వాలు చేయిస్తున్నారని ఆయన అన్నారు. వామపక్ష భావాలు కలిగిన పవన్ కల్యాణ్ బిజెపితో ఎలా జత కడుతారని ఆయన ప్రశ్నించారు.