జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ నేత సి.రామచంద్రయ్య. సుజనా చౌదరి మోసాలకు పాల్పడ్డారని ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రకటించినా.. పవన్ ఇంతవరకు స్పందించకపోవడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

దీనిని బట్టి చూస్తుంటే పవన్ ఎవరో చెప్పినట్లుగా పనిచేస్తున్నారనిపిస్తోంది అన్నారు. వందల కొద్ది డొల్ల కంపెనీలు సృష్టించి.. బ్యాంకుల నుంచి వేల కోట్లు రూపాయలు సంపదను కొల్లగొట్టారని మండిపడ్డారు.

తెలుగుదేశానికి 2009, 2014 ఎన్నికల ఖర్చు మొత్తం సుజనా చౌదరి నుంచే వచ్చిందని రామచంద్రయ్య ఆరోపించారు. అమాయక ప్రజలు ఎన్నో కష్టాలకొర్చి దాచుకున్న సొమ్మును చంద్రబాబు అండ్ కో దోచుకుని రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆయన ఎద్దేవా చేశారు.

చౌదరి చేసిన సాయానికి ఉపకారంగా చంద్రబాబు ఆయనకు కేంద్రమంత్రి పదవి ఇప్పించారని ఆరోపించారు. స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రజల డబ్బును దోచుకుంటున్నారని.. ఈ సొమ్మును ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకోవడానికి, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తున్నారన్నారు.

విశాఖ భూ కుంభకోణంతో పాటు అగ్రిగోల్డ్ వ్యవహారంలోనూ ప్రమేయమున్న మంత్రి భార్యను ముఖ్యమంత్రి కాపాడుతున్నారని రామచంద్రయ్య ఆరోపించారు. షెల్ కంపెనీలతో సుజనా చౌదరి 6900 కోట్ల రూపాయలను కొల్లగొట్టారని.. ఏ మాత్రం నెట్‌వర్క్ లేని కంపెనీలకు బ్యాంకులు ఎలా లోన్ ఇచ్చాయని ఆయన ప్రశ్నించారు.

బ్యాంకులను కూడా మేనేజ్ చేసిన చరిత్ర చంద్రబాబుదని.. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలకముందే.. చంద్రబాబు నాయుడిని చట్టం ముందు నిలబెట్టాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు.

సీబీఐని రాష్ట్రంలోకి అనుమతించకుండా సీఎం ఎందుకు జీవోలు జారీ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అవినీతిపరులను ఎంకరేజ్ చేస్తున్న చంద్రబాబు ఒక ఎకనామికల్ టెర్రరిస్ట్ అని రామచంద్రయ్య అన్నారు.