కర్నూల్ జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో మరోసారి అధికారపార్టీ నాయకుల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్, వైసిపి నియోజకవర్గ ఇంచార్జి బైరెడ్డి సిద్దార్థరెడ్డి మధ్య గతకొంతకాలంగా ఆదిపత్య పోరు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన ఎమ్మెల్యేను బైరెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నందికొట్కూరు నియోజకవర్గం మిడ్తూర్ మండలం తిమ్మాపురం గ్రామంలో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి ఎమ్మెల్యే ఆర్థర్ వెళ్లారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న బైరెడ్డి వర్గీయులు ఆయనను అడ్డుకున్నారు. గతంలో టీడీపీలో పనిచేసిన వారిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తూ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్న మల్లారెడ్డి,  మాజీ జడ్పీటీసీ యుగంధర్ రెడ్డి, సామిరెడ్డిలు ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

అయితే భూమి పూజ చెయ్యడానికి వచ్చిన ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే ఆర్థర్ ని అడ్డుకోవడం ఏంటని పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది.  ఎమ్మెల్యేను గ్రామంలోకి అడుగుపెట్టనివ్వమంటూ వారు రోడ్డుకు అడ్డంగా బైటాయించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

"

గతంలో కూడా కర్నూల్ జిల్లా వైసిపి నాయకుల మధ్య ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. చిన్న టెండర్ దక్కించుకునేందుకు ప్రయత్నించిన వైసిపికి చెందిన రెండు వర్గాలు చివరకు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఇలా పట్టపగలే...నడిరోడ్డుపై..అదీ ప్రభుత్వ కార్యాలయంలోనే ఓ వర్గంపై  మరో వర్గం దాడులకు దిగారు. ఇలా నగరంలో ఉద్రిక్తత  పరిస్థితులకు కారణమయ్యాయి.  

డీఈవో కార్యాలయంలో కోడిగుడ్ల సరఫరాకు సంబంధించి టెండర్ల హార్డ్ కాపీలను సమర్పిస్తున్న క్రమంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, డోన్ వైసీపీ యూత్ లీడర్ తమ్ముడు రాఘవేంద్ర గౌడ్ మద్య వాగ్వాదం ప్రారంభమైంది. అది కాస్త చిలికిచిలికి గాలివానలా మారి పెద్ద ఎత్తున ఘర్షణకు దారి తీసింది.