కర్నూలు: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి గట్టి షాక్ తగిలింది. రాయలసీమ ప్రాంతంలో బలమైన నేత అయిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.  

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువాకప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున శ్రీశైలం టికెట్ ఆశించి భంగపడ్డారు. 

ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా పరాజయం పాలవ్వడంతో రాజకీయాల్లో అంతగా యాక్టివ్ కాలేకపోయారు. రాజకీయాలజోళికి రావడం మానేశారు. అయితే రాయలసీమలో బీజేపీ బలపడాలనే ఉద్దేశంతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి గాలం వేసింది. 

బీజేపీ గాలానికి రాజశేఖర్ రెడ్డి చిక్కారు. దాంతో ఇక బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా గురువారం సాయంత్రం టీడీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది బీజేపీతోనే సాధ్యమని చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధికోసం తాను బీజేపీలో చేరాలని తాను నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రాంతీయ పార్టీలు  కన్నా జాతీయ పార్టీలతోనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ కోలుకోవడం సాధ్యం కాదని బైరెడ్డి అభిప్రాయపడ్డారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, అమరావతి ఫ్రీజోన్ వంటి డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా ఉందని అందువల్లే తాను బీజేపీలో చేరాలనుకుంటున్నట్లు తెలిపారు. 

రాయలసీమ అభివృద్ధే తన లక్ష్యమన్నారు. గతంలో కూడా రాయలసీమ అభివృద్ధి కోసం రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీనీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆ పార్టీని మూసేసి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి టీడీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా కాషాయిగూటికి చేరుకోనున్నారు బైరెడ్డి రాజేశేఖర్ రెడ్డి. 

ఇకపోతే తన తమ్ముడు కుమారుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ గా ఉన్నారు. గత ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గం గెలుపునకు అహర్నిశలు శ్రమించి గెలిపించుకున్న సంగతి తెలిసిందే. నందికొట్కూరు నియోజకర్గం నుంచి వైసీపీ నుంచి పోటీ చేసిన ఆర్థర్ ఘన విజయం సాధించడంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి..?