Asianet News TeluguAsianet News Telugu

అంతా ప్లాన్ ప్రకారమే: వైసిపి ఎంపీల సీట్లకు ఉప ఎన్నికలు హుష్ కాకి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ లోకసభ సభ్యులు చేసిన రాజీనామాలు ఆమోదించినా కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేనట్లే అనిపిస్తోంది. 

Bypolls may not come, if YCP Mps resignations accepted

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ లోకసభ సభ్యులు చేసిన రాజీనామాలు ఆమోదించినా కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేనట్లే అనిపిస్తోంది. నిబంధనలు ఆయన ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తమ రాజీనామాలను ఆమోదించాలని కోరుతూ వైసిపి ఎంపీలు ఈ నెల 29వ తేదీన స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలిసిన విషయం తెలిసిందే. 

వైసిపి ఎంపీలతో మాట్లాడిన తర్వాత తన నిర్ణయాన్ని సుమిత్రా మహాజన్ వచ్చే నెల మొదటివారానికి వాయిదా వేశారు. జూన్ 5, 7 తేదీల మధ్య ఆమె అందుకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరాన్ని నిర్వహించేందుకు అలా జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను పరిశీలిస్తే ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఏ మాత్రం లేదని అనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత 2014 జూన్ 4వ తేదీన లోకసభ తొలి సమావేశం జరిగింది. దాని ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2019 జూన్ 4వ తేదీకి ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది. 

వైసిపి ఎంపీల రాజీనామాలపై స్పీకర్ జూన్ 5వ తేదీ తర్వాత నిర్ణయం తీసుకుంటున్నారు. ఉప ఎన్నిక జరిగితే విజయం సాధించే సభ్యుడి పదవీ కాలం కనీసం ఏడాది ఉండాలనే నిబంధన ఉంది. అందువల్ల జూన్ 5వ తేదీ తర్వాత వైసిపి ఎంపిల రాజీనామాలను ఆమోదించినా ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేదని తేలిపోతోంది. 

అంతేకాకుండా ప్రత్యేక కారణాల వల్ల ఖాళీ అయిన స్థానాలకు పోలింగ్ నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ దాదాపు 90 రోజుల సమయం తీసుకుంటుంది. ఈలోగానే ఏడాది గడువు ముగుస్తుంది. అందువల్ల ఏ విధంగా చూసినా వైసిపి ఎంపీల రాజీనామాల వల్ల ఖాళీ అయ్యే స్థానాలకు ఉప ఎన్నికలు జరగవనేది అర్థమవుతోంది.

వైసిపి ఎంపీల రాజీనామాలు చిత్తశుద్ధితో చేసినవి కావని తేలిపోతోందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. రాజీనామాల పేరుతో వైసిపి, బిజెపి నాటకాలాడుతున్నాయని విమర్శించారు. రాజీనామాలు ఆమోదించాలని ఎంపిలు స్వయంగా కోరినా పెండింగులో పెట్టడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. బిజెపి, వైసిపిల పరస్పర అవగాహనతోనే ఈ నాటకం నడుస్తోందని ఆయన అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios