చిత్తూరు జిల్లా వి.కోట మండలం పట్రపల్లె గ్రామ సమీపంలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బు గుంజాలని ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సుబ్బన్న అనే మండీ వ్యాపారి సోమవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి తన బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా అప్పటికే కాపు కాచిన ఇద్దరు వ్యక్తులు ఆయనను కిందకు లాగారు.

ఆయన కిందపడగానే మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి అరిస్తే చంపేస్తామని బెదిరించారు. రూ. 20 లక్షలు ఇస్తే సరి.. లేకుంటే చంపేస్తామని సెల్‌ఫోన్ లాక్కొన్నారు. అనంతరం అతనిని చేతులు కట్టేసి... అరవకుండా ప్లాస్టిక్ టేపుతో కట్టేసి పక్కనే ఉన్న బాత్‌రూంలో పడేశారు.  

తనను చంపేస్తారేమోనన్న భయంతో సుబ్బన్న గదికి గొళ్లెం పెట్టుకున్నాడు. అనంతరం కిటికీ దుండగుల్లో ఒకడు కిటికీ వద్దకు వచ్చి ఫోన్ చేసి డబ్బు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించాడు. తన వద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో.. నీ గురించి అంతా తెలుసని,  కుటుంబం వివరాలు చెప్పడంతో సుబ్బన్న మరింత భయపడిపోయాడు.

దీంతో చేసేది లేక భార్యకు ఫోన్ చేసి ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకుని పొలం దగ్గరికి రమ్మన్నాడు. అలాగే మరో స్నేహితుడికి ఫోన్ చేయించి డబ్బు అడిగించారు. అయితే భర్త చెప్పినట్లుగా డబ్బు బ్యాగు తీసుకుని పొలానికి బయలుదేరిన సుబ్బన్న భార్య మరోసారి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది.

దీంతో ఆమెకు అనుమానం వచ్చి బంధువులకు ఫోన్ చేసి తనతో పాటు పొలం వద్దకు రావాలని చెప్పింది. సుబ్బన్న భార్యతో పాటు అతని బంధువులు రావడాన్ని చూసిన ఇద్దరు ఆగంతుకులు పారిపోయేందుకు సిద్ధమయ్యారు.

సుబ్బన్న బైక్, సెల్‌ఫోన్‌ను తీసుకుని వారిద్దరు అక్కడి నుంచి జారుకున్నారు. అనంతరం సుబ్బన్న భార్య, ఇతర బంధువులు అక్కడికి చేరుకుని గది తాళం బద్దలు కొట్టి అక్కడి అతనిని బయటకు తీసుకొచ్చారు.

అనంతరం బంధువుల సహకారంతో పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికులను విచారించారు. ఐదుగురు వ్యక్తులు ముఖాలకు ముసుగు వేసుకుని బైక్‌లపై హడావిడిగా కర్ణాటక వైపుకు వెళ్లారని తెలిపారు.

కాగా గతంలో వి. కోట మండలంలో నాలుగు దోపిడీలు జరిగాయి. ఇది పాత నేరస్థుల పనా.. లేదంటే గిట్టని వారు సుబ్బన్నను బంధించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

క్లూస్ టీం సాయంతో సుబ్బన్నను బంధించిన గది తాళానికి ఉన్న వేలి ముద్రలను సేకరించారు. అలాగే డాగ్ స్క్వాడ్‌ సైతం దుండగులు వెళ్లిన ప్రాంతానికి కాస్త దూరం వరకు వెళ్లొచ్చాయి.