ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రుల కోసం ఆర్టీసీ 10 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన రెండు అత్యాధునిక బస్సులు ప్రస్తుతం విజయవాడ డిపో గ్యారేజీలో ఉత్సవ విగ్రహాలు లాగ మిగిలిపోయాయి. నూతన ప్రభుత్వం కొలువు తీరి ఐదు నెలలైనా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఇప్పటివరకు వీటిని ఉపయోగించింది లేదు.

బస్సుల వాడకం లేకపోవడం వల్ల  నిర్వహణ కోసం ఆర్టీసీకి తడిసి మోపెడు అయితుంది.  వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు ఒకటి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు హయాంలో మరొకటి చొప్పున రెండు బస్సులను ఏపీఎస్‌ఆర్‌టీసీ కొనుగోలు చేసింది. 

ఈ బస్సులను వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబులు వినియోగించారు. ప్రస్తుత ప్రభుత్వం వీటిని ఉపయోగిస్తే.. ఈ బస్సుల మెయింట్‌నెన్స్‌ ఖర్చును రీయింబర్స్‌మెంట్‌ కోసం ఆర్టీసీ దరఖాస్తు చేసుకుంటుంది కాబట్టి భారం ఆర్టీసీ మీద పడదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుందని ఆర్టీసీ భావిస్తోంది. 

ఈ బస్సుల స్పెషాలిటీస్... 

ల్యాండ్‌మైన్స్‌ , మందుపాతరలు, ఇతర బాంబులు పేలినా కూడా ఈ బస్సులో ఉన్న వారు సురక్షితంగా ఉంటారు. ఒక రకంగా ల్యాండ్ మైన్స్ ని తట్టుకునే విధంగా ఈ బస్సులు రూపొందించబడ్డాయి. బస్సుల బాడీ బుల్లెట్‌ ప్రూఫ్‌ అవడం వల్ల తుపాకీ గుళ్ళను సునాయాసంగా తట్టుకుంటుంది. 

అత్యాధునిక కమ్యూనికేషన్‌ వ్యవస్థను ఈ బస్సుల్లో పొందుపరిచారు. శాటిలైట్‌ ఫోన్‌, అత్యాధునికమైన ఇంటీరియర్స్, లగ్జరీ ఫర్నిచర్‌ ఇందులో ఏర్పాటు చేసారు. ముఖ్యమంత్రికి అటాచ్డ్‌ బాత్రుమ్‌తో కూడిన బెడ్‌రూమ్‌, మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌ వంటివి ఉన్నాయి. 

ముఖ్యమంత్రుల కోసం కొనుగోలు చేసిన బస్సులను భద్రపరచటానికి విజయవాడ డిపోలో  లక్షల వ్యయంతో పర్మినెంట్‌ షెడ్డును ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ కోసం ఒక పదవీ విరమణ చేసిన వ్యక్తిని ఎంఎఫ్‌గా భారీ జీతం ఇచ్చి నియమించారు. 

ఒక మెకానిక్‌, ఓ ఎలక్ట్రీషియన్ కూడా బస్సుల నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు.  ఇంతకుముందు వరకు, షిఫ్టుల వారీగా ఆరుగురు డ్రైవర్లు 24 గంటల పాటు డ్యూటీలు చేసేవారు. ప్రస్తుతం బస్సులు బయటకు తీయకపోవడం వల్ల ఒక డ్రైవర్‌ మాత్రమే ఉంటున్నాడు. 

ఈ బస్సులకు కాపలాగా 24 గంటలపాటు మూడు షిప్టులలో నాలుగు నుంచి ఐదుగురు చొప్పున ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు.  ఖాళీగా మూలకు ఉంచితే బస్సులు పాడయిపోతాయి కాబట్టి రోజూ ఈ బస్సులను గ్యారేజీ ఆవరణలో కొద్దిసేపు నడుపుతారు. ఏసీని రెండు నుంచి మూడుగంటల పాటు ఆన్ చేస్తారు. ఎలక్ట్రీషియన్ వైరింగ్,ఇతరాత్రాలన్నిటిని చెక్ చేస్తాడు. 

ఒక ఆయా ఈ బస్సులను శుభ్రపరుస్తుంటుంది. ఈ బస్సులో ఏసీని రోజు ఆన్ చేసి ఉంచడం వల్ల డీజిల్ వ్యయం ఆర్టీసీకి భారమవుతోంది. సిబ్బంది విధులు, నిర్వహణ వ్యయం లక్షల్లోనే ఉంటుంది. ఈ భారం ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో, నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై తీవ్ర భారాన్ని మోపుతున్నాయి. 

నూతన ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆర్టీసీ బస్సులను రెండు దఫాలు తాడేపల్లి తీసుకు వెళ్లినట్టు సమాచారం. జీఏడీ, ముఖ్యమంత్రి భద్రతా విభాగాలు ఈ బస్సులను వినియోగించేందుకు అంత ఆసక్తి  కనబర్చలేదని  తెలియవస్తోంది . ముఖ్యమంత్రి మరికొన్ని రోజుల్లో పల్లెబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. కనీసం ఆ యాత్ర సందర్భాంగానైనా ఈ బస్సులను ఉపయోగిస్తే బాగుండునని ఆర్టీసీ వర్గాలు కోరుకుంటున్నాయి.