Asianet News TeluguAsianet News Telugu

మీ ట్వీట్లు... నా సమాధానం: చంద్రబాబు తనదైన స్టైల్లో కడిగిపారేసిన మంత్రి బుగ్గన

ఇప్పటివరకు కేవలం నారా లోకేష్ ఒక్కరే ట్వీట్లు పెట్టేవారని... ఇప్పుడు చంద్రబాబు కూడా ట్వీట్ల దారి పట్టారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

buggana rajendranath reddy strong reply to chandrababu
Author
Amaravathi, First Published Jun 5, 2020, 9:52 PM IST

అమరావతి: ఇప్పటివరకు కేవలం నారా లోకేష్ ఒక్కరే ట్వీట్లు పెట్టేవారని... ఇప్పుడు చంద్రబాబు కూడా ట్వీట్ల దారి పట్టారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఈ మధ్య ట్వీట్ల ద్వారా విమర్శలు చేస్తున్నారని... అవన్నీ కూడా అవాస్తవాలతో నిండిఉన్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు ట్విట్టర్ ద్వారా చేసిన విమర్శలకు బుగ్గన జవాభిచ్చారు. 

 ''పేదలకోసం టిడిపి ప్రభుత్వం 29.52 లక్షల ఇళ్ళు మంజూరు చేసింది. 9.1 ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసి మూడుదశలలో 8 లక్షల గృహప్రవేశాలు చేయించింది. మరో 20.41 లక్షల ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి.  ఇప్పుడున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడులక్షల రూపాయలు కూడా విలువ చేయని భూములను 45 లక్షలు చెల్లించి కొనుగోలు చేశారు. ఇంటి స్ధలం కావాలంటే 30 వేలు...60 వేలు....లక్షన్నరచొప్పున రేట్లు నిర్ణయించి దందా ప్రారంభించారు''  అంటూ చంద్రబాబు హౌసింగ్ పై ట్వీట్ పెట్టారని గుర్తుచేశారు. 

దీనికి బుగ్గన తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. ''వాస్తవానికి 1999 నుండి 2004 వరకు చంద్రబాబు మొదటిసారి పాలనలో 6.85 లక్షల ఇళ్లు కట్టారు. 2004 నుంచి 2009 వరకు వైయస్ రాజశేఖరరెడ్డి గారి పాలనలో 24.18 లక్షల ఇళ్ళు కట్టడం జరిగింది. 2010 నుంచి  2014 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం 11.13 లక్షల ఇళ్లు కట్టడం జరిగింది. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పాలనలో ఏడులక్షల ఏభైవేల ఇళ్లు కట్టారు'' అన్నారు. 

''వైయస్ జగన్ మేనిఫెస్టోలో పెట్టిన దానిలో భాగంగా ఐదేళ్లలో 30 లక్షల ఇళ్లు కట్టాలనే లక్ష్యంతో దాదాపు 30 లక్షల ఇంటిపట్టాలు ఇవ్వాలని సంకల్పించారు. దీనికి భూసేకరణ జరుగుతోంది.  చంద్రబాబు తీరు చూస్తే ఈ ప్రభుత్వం 30 లక్షల ప్లాట్లు ఇస్తుందా అనే బాధ ఉన్నట్లుగా ఉంది. బాధ ఉంది కాబట్టే అవాస్తవాలతో కూడిన ఆరోపణలతో ట్వీట్లు చేస్తున్నారు. ఆయన ఇచ్చిన అంకెలు పూర్తిగా తప్పు. తను ఐదేళ్లలో ఏడులక్షల ఏభైవేల ఇళ్లు కడితే ఈ ప్రభుత్వం 30 లక్షల ఇళ్లకు గాను  ఏడాది మూడునెలల్లోనే ప్లాట్లను ఇచ్చేందుకు సిధ్దపడుతోంది'' అని వివరించారు. 

''గతంలో చంద్రబాబు మొదటివిడతలో 6 లక్షల 85 వేల ఇళ్లు కడితే వైయస్ రాజశేఖరరెడ్డి తన పాలనా కాలంలో 24 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించారు.ఇంత తేడా పెట్టుకుని అవాస్తవాలు మాట్లాడుతున్నారు. 2014 నుంచి 2019 వరకు లెక్కిస్తే గ్రామీణ హౌసింగ్ కింద 4 లక్షల 60 వేల చిల్లర. పిఎంఏవై కింద 47 వేల చిల్లర. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద 92 వేల చిల్లర.హుద్ హుద్ హౌసింగ్ కింద ఎనిమిది వేల చిల్లర. ఇందిరా ఆవాస్ యోజన హౌసింగ్ కింద లక్షా నలభైవేల చిల్లర. ఏపి స్టేట్ హౌసింగ్ కార్పోరేషన్ అంతా కలిపితే 7,49,467 గా ఉంది''  అని తెలిపారు. 

read more   అలాగయిలే చరిత్రహీనుల్లా మిగిలిపోతాం... జాగ్రత్త: చంద్రబాబు హెచ్చరిక

'' 2014-15, 2015-16లలో ఇంచుమించు హౌసింగ్ ప్రోగ్రామ్ లేదు. నిజానికి ఇందిరా ఆవాస్ యోజన కింద ఈ రెండు ఆర్దికసంవత్సరాలలో వరుసగా 76,330, 73,230 హౌసింగ్ నిర్మాణం జరిగాయి. అంటే కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ తప్ప రాష్ర్టప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.  ఆ రెండు సంవత్సరాలలో ఏం చేశారంటే అంతకుముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఇళ్ల నిర్మాణంలో తప్పిదాలు ఉన్నాయి. వాటిని సరిచేయాలని జియో టాగింగ్ అని చెప్పి ఏమీ తేల్చలేదు. అవేమీ తేల్చకపోగా ఈరోజు అంకెలు చెబుతున్నారు. ఆ అంకెలన్నా సరిగా చెబుతున్నారా అంటే ఏడులక్షల ఏభైవేలు పూర్తై ఉంటే చంద్రబాబు 9 లక్షల పదివేలు పూర్తయ్యాయని చెబుతున్నాడు'' అన్నారు. 

''16 లక్షల చిల్లర గృహాలు మంజూరు అయితే, 29 లక్షల చిల్లర మంజూరు అయ్యాయని చంద్రబాబు చెబుతున్నాడు. నిజానికి 16 లక్షల చిల్లరలో గ్రౌండ్ అయినవి 13 లక్షల చిల్లర...పూర్తి అయినవి ఏడులక్షల ఏభైవేలు. అంటే పావుభాగమే పూర్తి అయింది. ఇవన్నీ పరిశీలిస్తే తను చెబుతున్న అంకెలు,కారణాలు, విషయాలు తప్పే. పైగా జగన్ గారి ప్రభుత్వం హౌసింగ్ ప్రోగ్రామ్ సరిగా చేయడం లేదని మాట్లాడుతున్నారు. మీ భావనలో 30 లక్షల ఇళ్లు ఐదేళ్లలో కట్టడం తప్పు....30 లక్షల ఇళ్ల పట్టాలు పేదలకు ఇవ్వడం తప్పు కదా'' అని నిలదీశారు.

''30వేలు...60 వేలు...లక్షా ఏభైవేలు లంచాలు తీసుకుంటున్నారంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. డబ్బులు వసూలు చేయాలంటే శ్లాబులు ఉంటాయా....ఇలా ఎలా మాట్లాడగలగుతున్నారు. ఈ పధకం కింద శాచ్యురేషన్ పద్దతిలో ఇంటిపట్టాలు ఇవ్వాలని భావిస్తున్నాం. నిబంధనలు ఏమంటే ....లబ్దిదారునికి బిపిఎల్...రేషన్ కార్డు ఉండాలి.
 ఇంతకుముందు హౌసింగ్ ప్రోగ్రామ్ లో బెనిఫిట్ పొంది ఉండకూడదు. సొంతఇళ్లు ఉండకూడదు. దీనిప్రకారం లబ్దిదారులు నిర్ణయించబడుతున్నారు. ఎవరైనా అర్హులు దరఖాస్తు పెట్టుకోవచ్చు. వాలంటీర్ ఇంటికివచ్చి దరఖాస్తు తీసుకుంటారు'' అని తెలిపారు. 

''గత ఏడాది ఆగష్టు,సెప్టెంబర్ లలో దరఖాస్తులు తీసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్ లో...నవంబర్,డిసెంబర్ లో...జనవరిలో మూడుసార్లు సోషల్ ఆడిట్ జరిగింది.  సోషల్ ఆడిట్ అంటే అర్దమేంటి...గ్రామసభలో వీళ్లు లబ్దిదారులు అంటూ డిస్ ప్లే చేస్తారు.వాటిలో పొరపాట్లు ఉంటే చెప్పండి...ఒకవేళ మీరు అప్లికేషన్ పెట్టీ రాకపోతే తిరిగి అప్లికేషన్ ఇవ్వండి...లేదా నాకు న్యాయం జరగలేదని తహసిల్దార్, ఆర్డిఓల దగ్గరకు వెళ్లండి అక్కడకూడా న్యాయం జరగకపోతే స్పందన లో ఇవ్వండి. అంటే వాస్తవానికి ఇన్ని అవకాశాలు ఇచ్చారు. ఆగష్టులో అప్లికేషన్లు తీసుకుంటే పలుమార్లు అవకాశాలు ఇచ్చారు.అలా చేస్తే 22 లక్షల అప్లికేషన్లు వచ్చాయి.ఇవి చాలక సిఎంగారు ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తులు పెట్టుకోమని అడిగితే మే నెలలో 6 లక్షల అప్లికేషన్లు వచ్చాయి.వాటిని కూడా వెరిఫై చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా నడుపుతూ 30 లక్షల హౌస్ సైట్లు ఇస్తుంటే, అమ్ముకుంటున్నారని అంటున్నారు.అర్హులైన ప్రతిఒక్కరికి ఇంటి పట్టా ఇస్తున్నప్పుడు అమ్మేదానికి ఎక్కడ అవకాశం ఉంటుంది.ఇలా మాట్లాడటం తప్పు.రాజకీయంగా ఇంత అనుభవం ఉన్న మీరు అవాస్తవాలు ఎలా చెప్పగలుగుతున్నారు'' అంటూ చంద్రబాబును బుగ్గన నిలదీశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios