విజయసాయికి కరోనా పాజిటివా? సిబిఐ పాజిటివా?: బుద్దా వెంకన్న
వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఏపీలో కాకుండా పక్కరాష్ట్రంలోని హైదరాబాద్ లో కరోనా చికిత్స పొందడాన్ని బుద్దా వెంకన్న తప్పుబట్టారు.
విజయవాడ: వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం తెలియగానే విజయసాయి త్వరగా ఈ కరోనా బారినుండి బయటపడాలని కోరుకున్నారు బుద్దా వెంకన్న. ఇదే క్రమంలో ఆయన ఏపీలో కాకుండా పక్కరాష్ట్రంలోని హైదరాబాద్ లో కరోనా చికిత్స పొందడాన్ని వెంకన్న తప్పుబట్టారు. దీనిపై ట్విట్టర్ వేదికన ఘాటుగా స్పందించారు వెంకన్న.
''అదేంటి హైదరాబాద్ పారిపోయారా? కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారా విజయసాయిరెడ్డి గారు. ఓహో అల్లుడు పాలన మీద నమ్మకం లేదా?గుండ్రాయిలా ఉన్న అచ్చెన్న కి కార్పొరేట్ వైద్యం ఎందుకు ఈఎస్ఐ ఉండగా అని ఒక బిసి నాయకుడిని అవమానిస్తూ మీ రాక్షస మనస్తత్వం బయటపెట్టారు'' అంటూ విజయసాయిపై మండిపడ్డారు.
''మరి మీరు విశాఖలో కేజీహెచ్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లడం ఏంటి? అన్నట్టు ఇది కరోనా పాజిటివా? వివేకా గారి కేసులో సీబీఐ పాజిటివా? ఆయన హత్యకు గురైనప్పుడు మీరు సంభ్రమాశ్చర్యాలకు గురైయ్యారు గుర్తుందా?'' అంటూ ట్విట్టర్ ద్వారా విజయసాయికి ప్రశ్నలు సంధించారు బుద్దా వెంకన్న.
read more గుండ్రాయిలా వున్న విజయసాయికి కార్పోరేట్ వైద్యమా...అదీ పక్కరాష్ట్రంలో: అయ్యన్న ఫైర్
అంతకు ముందు ''రాజకీయంగా ట్విట్టర్ ప్రత్యర్థులమే తప్ప వ్యక్తిగతంగా మా మధ్య ఎటువంటి గట్టు తగాదా లేదు. ఎంపీ విజయసాయి రెడ్డి గారు కనికరం లేని కరోనా బారిన పడటం బాధాకరం. ఆయన కరోనా నుండి త్వరగా కోలుకుని ట్విట్టర్ లో యాక్టివ్ అవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను'' అంటూ వెంకన్న ట్వీట్ చేశారు.