వైఎస్ జగన్ అక్రమసంపాదన అంతా అవినాష్ రెడ్డి చేతుల్లోనే ఉందని.. అందుకే అతని అరెస్టును జగన్ అడ్డుకుంటున్నాడని.. బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు.
కడప : మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మీద సంచలన ఆరోపణలు చేశారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ ని జగన్ అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. కడపలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘సీఎం జగన్ అక్రమ సంపాదనను అవినాష్ రెడ్డి దగ్గర భద్రపరిచినట్లు నాకు సమాచారం ఉంది. అందువల్లే అవినాష్ రెడ్డి అరెస్టుని జగన్ అడ్డుకుంటున్నాడు’ అంటూ ఆరోపణలు చేశారు.
ఈ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ అక్రమ సంపాదనను 2000 రూపాయల నోట్ల రూపంలో అవినాష్ రెడ్డి దగ్గర భద్రపరిచినట్లు నాకు సమాచారం ఉంది. అవి పెట్టిన లాకర్లు తెరవాలంటే అవినాష్ రెడ్డి వేలిముద్రలు కావాలి. ప్రస్తుతం ఆ రెండు వేల రూపాయల నోట్లు తీసి బ్యాంకులో మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే ఆ డబ్బును మార్చుకోలేరు. ఈ భయంతోనే జగన్ నాటకాలు ఆడిస్తున్నారు.
దీంతోపాటు అవినాష్ రెడ్డి అరెస్టు వైసీపీకి తీరని నష్టాన్ని కలిగిస్తుంది. మే 25వ తేదీవరకు అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా చూసుకోవాలని… ఈ నాటకమంతా ఆడిస్తున్నారు. ఎందుకంటే.. మే 25వ తేదీన సిబిఐకి కొత్త డైరెక్టర్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఆయన తమకు అనుకూలంగా ఉండబోతున్నాడని పులివెందులలోని వైసీపీ నాయకులు ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు’ అని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపణలు గుప్పించారు.
అవినాష్ రెడ్డి గతంలో అతని మీద జరిగిన సిబిఐ విచారణలో తాడేపల్లెకు చెందిన కొన్ని పేర్లు బయటపెట్టారని.. ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే.. ఈ మేరకు ఇబ్బందులు తలెత్తుతాయని సీఎం భయపడుతున్నాడని కూడా విమర్శలు చేశారు.
ఇదిలా ఉండగా, మంగళవారం నాడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఈనెల 25వ తేదీన వెకేషన్ బెంచ్ కు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. మంగళవారం సుప్రీంకోర్టులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారించింది. దీని మీద ఈనెల 25వ తేదీన విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.
మే 22వ తేదీన తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ను తన ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారించేలా ఆదేశించారని అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేసిన తర్వాత తుది తీర్పు ఇవ్వాలని ఆ పిటిషన్లో అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్ విచారణ నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఏప్రిల్ 24 తర్వాత ఎన్నిసార్లు సిబిఐ విచారణకు వెళ్లారని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
దీనికి వైఎస్ సునితారెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మూడుసార్లు సిబిఐ నోటీసులు జారీ చేసినా కూడా వైఎస్ అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాలేదని తెలిపారు. అంతేకాదు, కర్నూలులో సోమవారం చోటు చేసుకున్న పరిణామాలను కూడా ఆయన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఉంచారు.
