తల్లికి అనారోగ్యంగా వుంటే అవినాష్ వెళ్లకూడదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. ఏం చెప్పినా, ఏం రాసినా జనం నమ్మేస్తారని రామోజీరావు అనుకుంటున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్నిసార్లయినా బెయిల్ తెచ్చుకోవచ్చా.. ఏ రోజైనా సీబీఐ విచారణకు వెళ్లారా అని అన్నారు.
అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణపై ఎల్లో మీడియాకు అత్యుత్సాహం ఎందుకని ప్రశ్నించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుండెజబ్బు వచ్చిన తల్లి కోసం ఎంపీ అవినాష్ విచారణ నుంచి వెసులుబాటు అడిగారని చెప్పారు. తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని వెనక్కి వెళ్తే ఇంత దుష్ప్రచారమా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారని నాని నిలదీశారు. చంద్రబాబు ఎన్నిసార్లయినా బెయిల్ తెచ్చుకోవచ్చా.. ఏ రోజైనా సీబీఐ విచారణకు వెళ్లారా అని పేర్ని నాని ప్రశ్నించారు.
మోడీతో తగాదా పెట్టుకుంటే రాష్ట్రంలోకి సీబీఐ రాకూడదా అని ఆయన చురకలంటించారు. చంద్రబాబు అన్నం తిని బ్రతకడం కంటే బెయిల్ తెచ్చుకుని బతుకుతుంటారని పేర్ని నాని చురకలంటించారు. మీకు కనీసం మానవత్వం కూడా లేదని ఆయన దుయ్యబట్టారు. అవినాష్ రెడ్డి ఎక్కడికైనా పారిపోయారా అని పేర్ని నాని ప్రశ్నించారు. జగన్‌ను చూస్తే వీళ్లకు కడుపు మంట అని.. పిలిచిన ప్రతీసారి అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో సీబీఐకి వ్యతిరేకంగా ఈనాడు వార్తలు రాసిందని నాని ఆరోపించారు.
ALso Read: వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో ఓ వర్గం మీడియా దుష్ప్రచారం: సజ్జల రామకృష్ణారెడ్డి
తల్లికి అనారోగ్యంగా వుంటే అవినాష్ వెళ్లకూడదా అని నాని ప్రశ్నించారు. కేంద్ర బలగాలు వస్తున్నాయని హడావుడి చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే కూడా తప్పేనా అని నాని ప్రశ్నించారు. 2018 నవంబర్ 11న జీవో నెం.176ని టీడీపీ సర్కార్ తీసుకొచ్చిందని.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ అడుగుపెట్టడానికి వీల్లేదన్నారని నాని గుర్తుచేశారు. చంద్రబాబు కోసం ఎల్లో మీడియా ఎంతకైనా బరి తెగిస్తుందని.. వైసీపీ ప్రభుత్వమంటే ఎందుకంత కడుపు మంట అని ఆయన ప్రశ్నించారు. సీబీఐ విచారణకు హాజరుకావడానికి అవినాష్ వారం సమయం అడిగారని నాని గుర్తుచేశారు.
చంద్రబాబు సభలకు జనం రావడం లేదన్న వార్తలు వేశారా అని ఆయన ప్రశ్నించారు. ఖాళీ కుర్చీలకు స్పీచ్ ఇచ్చిన ఘనుడు చంద్రబాబని నాని చురకలంటించారు. జనం లేకుంటే జనం అద్భుతంగా వచ్చారంటూ వార్తలు రాస్తారని ఆయన దుయ్యబట్టారు. సీఎం జగన్ సభకు జనం వస్తే మాత్రం తప్పుడు రాతలు రాస్తారని నాని ఎద్దేవా చేశారు. ఏం చెప్పినా, ఏం రాసినా జనం నమ్మేస్తారని రామోజీరావు అనుకుంటున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. కానీ ప్రజలకు అన్ని విషయాలు తెలుసునని ఆయన అన్నారు. చంద్రబాబుకు మేలు చేకూర్చేందుకే ఎల్లో మీడియా తాపత్రయమని.. కేంద్రం ఇచ్చిన నిధులపై ఇష్టమొచ్చిన కథనాలు రాస్తున్నారని నాని ఆరోపించారు.
