పట్టపగలు ... రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా  హత్య చేయడంతో విశాఖపట్నం జిల్లా ఉలిక్కిపడింది. చోడవరం మండలం బెన్నవోలు గ్రామానికి చెందిన పండూరు సత్తిబాబు అలియాస్ ప్రభాస్ గతంలో చోడవరంలో బట్టల షాపు నిర్వహించాడు.

స్థానిక పిళ్లావారి తోటకు చెందిన కోన రాజేశ్ వీరి వద్ద పనిచేసేవాడు. ఈ సమయంలో ప్రభాస్ భార్యతో రాజేశ్‌కు సాన్నిహిత్యం పెరిగి అదికాస్తా.. అక్రమ సంబంధానికి దారి తీసింది. ప్రభాస్‌కు ఈ సంగతి తెలియడంతో ఇద్దరిని మందలించాడు.

తర్వాత వ్యాపారం ఎత్తేసి బెన్నవోలుకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న రాజేశ్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్‌లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం చోడవరం మెయిన్‌రోడ్‌లో ఉన్న మద్యం దుకాణానికి రాజేశ్ తన మిత్రులతో కలిసి వచ్చాడు.

ఇదే సమయంలో వెనుక నుంచి హెల్మెట్ పెట్టుకుని బైక్‌పై వచ్చిన ప్రభాస్... కత్తితో రాజేశ్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. రక్తపు మడుగులో అతను విలవిలలాడుతూ కిందపడిపోయాడు.

అనంతరం వచ్చిన బైక్‌పైనే పారిపోయిన ప్రభాస్.. మరోసారి వెనక్కి వచ్చి ఇంకో రెండుసార్లు రాజేశ్‌ను నరికాడు. చనిపోయాడనుకుని నిర్ధారించుకున్న తర్వాత తన భార్యను కూడా చంపాలని నిర్ణయించుకుని బెన్నవోలు బయల్దేరాడు.

హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.  రాజేశ్‌ను హత్య చేసిన ప్రభాస్... భార్యను చంపేందుకు బెన్నవోలు వెళుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.

ఈ విషయం గ్రామస్తులకు సైతం తెలియడంతో ఆమెను రహస్య ప్రదేశంలో ఉంచారు. పోలీసులు వచ్చిన విషయాన్ని గ్రహించిన సత్తిబాబు పారిపోవడానికి ప్రయత్నించగా... అన్ని వైపుల నుంచి చుట్టుముట్టడంతో దొరికిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.