ఇద్దరు టిడిపి కార్యకర్తలను ఎత్తుకెళ్లి వైసిపి కార్యాలయంలో పెట్టి స్వయంగా ఎమ్మెల్యే తనయుడే కొట్టించాడట. తాడిపత్రి నియోకవర్గంలో తీవ్ర గాయాలతో ఇద్దరు టిడిపి కార్యకర్తలు హాస్పిటల్లో చేరారు. 

తాడిపత్రి :అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య మాటలయుద్దం కాస్త ముదిరి భౌతిక దాడులకు దారితీస్తున్నారు. ఇలా తాజాగా వైసిపి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్ రెడ్డి అనుచరులతో కలిసి ఇద్దరు టిడిపి కార్యాకర్తలను విచక్షణారహితంగా కొట్టడంతో వారు హాస్పిటల్ పాలయ్యారు. ఈ ఘటన తాడిపత్రిలో చోటుచేసుకుంది. 

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని పాతకోట కాలనీలో నిన్న(బుధవారం) టిడిపి కార్యకర్తలు మణికంఠ, రమణ ఓటర్ల జాబితా పట్టుకుని క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని... భారీగా దొంగఓట్లు నమోదవడంతో పాటు ప్రతిపక్షాలకు అనుకూలంగా వున్నవారి ఓట్లను తొలగించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే టిడిపి కార్యకర్తలిద్దరు క్షేత్రస్థాయికి వెళ్ళి ఓటర్ల జాబితాలో పేర్లను సరిచూసుకుంటున్నార. 

అయితే వీరివద్దకు ఓ ఇద్దరు మున్సిపల్ సిబ్బందిమంటూ వచ్చి బైక్ పై ఎక్కించుకుని నేరుగా వైసిపి కార్యాలయానికి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్ రెడ్డి తన అనుచరులతో కలిసి తమను చితకబాదినట్లు బాధితులు వాపోయారు. నోటికొచ్చిన బూతులు తిడుతూ కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా కొట్టారని టిడిపి కార్యకర్తలు రమణ, మణికంఠ తెలిపారు. 

Read More బీజేపీతో పొత్తుపై చులకన కాలేనంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

తమను కొట్టిన విషయం ఎవరికి చొప్పొద్దని ఎమ్మెల్యే కొడుకు బెదిరించారని... బైక్ పైనుండి పడి గాయాలైనట్లు చెప్పమన్నారని బాధితులు వెల్లడించారు. పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టించాలని చూస్తే ఈసారి ఇంటికొచ్చి మరీ కొడతామని బెదిరించారని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రమణ, మణికంఠ తెలిపారు. 

ఇలా వైసిపి నాయకుల దాడిలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కార్యకర్తలను తాడిపత్రి టిడిపి ఇంచార్జ్ జేసి అస్మిత్ రెడ్డి పరామర్శించారు. గాయపడిన రమణ, మణికంఠకు దైర్యం చెప్పిన అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సీరియస్ అయ్యారు. మాట్లాడితే మగతనం అంటావుగా... సామాన్య కార్యకర్తలపై ప్రతాపం చూపించడమేనా నీ మొగతనం అంటూ పెద్దారెడ్డిపై మండిపడ్డారు. ఇలాంటి దాడులకు భయపడబోమని... వైసిపి ప్రభుత్వ అరాచక పాలనపై పోరాటం చేస్తూనే వుంటామని అస్మిత్ రెడ్డి తెలిపారు.