బీజేపీతో పొత్తు విషయం ఇప్పుడే మాట్లాడి చులకన కాలేనంటూ చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది విలేఖరులతో బుధవారం ఇష్టాగోష్టీ నిర్వహించారాయన. 

అమరావతి : బిజెపితో పొత్తు విషయం మీద టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. పొత్తు పెట్టుకునే విషయంలో ఇప్పుడే మాట్లాడలేనని.. చులకన కాదల్చుకోలేదని ఆయన అన్నారు. మంగళగిరిలోని టిడిపి కార్యాలయంలో బుధవారం నాడు కొంతమంది మీడియా ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు ఇష్టా గోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు బిజెపితో పొత్తు విషయంమీద ప్రశ్నించారు. దీనిమీద మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎవరెవరో ఏదేదో మాట్లాడితే.. తాను దానిమీద స్పందించనని అన్నారు.

రాష్ట్ర సమస్యల మీద ప్రజలు, ప్రభుత్వం గట్టిగా ఉంటే కేంద్రం తనంతట తానే దిగివస్తుందని చెప్పుకొచ్చారు. దీనికి ఉదాహరణగా జల్లికట్టు ఘటనను చెప్పుకొచ్చారు. అవసరమైతే తానే ఢిల్లీతో పోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు. మరోవైపు బిజెపితో పొత్తు కోసం చంద్రబాబునాయుడు ఇటీవల ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ కేంద్రమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాసారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వగా కాసేపు మాట్లాడి వచ్చారు. ఈ మీటింగ్ తర్వాతే బిజెపి టిడిపితో పొత్తుకు సిద్ధమైందని సంబంధిత మీడియాలో.. సోషల్ మీడియాలో జోరుగాప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే బుధవారం చంద్రబాబు నాయుడు దీనికి పూర్తిగా వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేయడంతో.. ఇవి గందరగోళంలో పడేస్తున్నాయని టిడిపి నేతలు చెబుతున్నారు.

వైసీపీలో తీవ్ర విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..

ఇక, ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన వాలంటీర్ల గురించి కూడా చంద్రబాబు నాయుడు ఇష్టాగోష్టిలో మాట్లాడారు. టిడిపి అధికారంలోకి వస్తే వాలంటీలను ప్రజాసేవకు మాత్రమే పరిమితం చేస్తామని.. ఈ విషయాన్ని పరిశీలిస్తామన్నారు.అంతేకాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడలేదని వెనకేసుకొచ్చారు. వాలంటీర్ల సేవలకు తాము గౌరవం ఇస్తామని.. కానీ, వాలంటీర్లు వ్యక్తిగత సమాచారం సేకరించడం ద్రోహం అని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అన్నారు. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తామంటే మాత్రం సహించేది లేదన్నారు.

రాష్ట్రంలో వైసీపీ చేసిన విధ్వంసం వల్ల టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అయినా తనకున్న బ్రాండ్, పాలసీలతో వేగంగానే సంపద సృష్టిస్తానని చెప్పుకొచ్చారు. ‘పూర్ టు రిచ్’ విధానాన్ని అర్థం చేసుకోవడం కష్టమే కానీ దానివల్ల అద్భుతాలు జరుగుతాయని చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు. టిడిపి ప్రకటించిన సూపర్ సిక్స్ మేనిఫెస్టోకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుంది అన్నారు. టిడిపి కార్యాలయంలో ఈనెల 14న మహాశక్తి కార్యక్రమం మీద ప్రచారం ప్రారంభిస్తామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 50 రోజులపాటు బస్సులు, కార్లలో మహిళా నేతలు, కార్యకర్తలు పర్యటన చేస్తారని తెలిపారు. కాకుండా మహిళలకు ఇంకా ఏం చేయొచ్చో ఆలోచిస్తున్నానన్నారు. జగన్ ను ఉద్దేశించి ఒక మూర్ఖుడి నిర్ణయానికి తెలుగుజాతి బలవ్వాలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా పడిందని.. అది ఎప్పటికీ తేలుతుందో తెలియదని అన్నారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి లాంటిదని.. జగన్ అసమర్థతతో దాని నాశనం చేశారని మండిపడ్డారు. 

ఏపీలో నీటి కరువు విషయం మాట్లాడుతూ.. నదుల అనుసంధానం కోసం తాను ప్రతిపాదించిన ప్రణాళికను చేపట్టి ఉంటే నీటి కరువు ఉండేది కాదని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం పోలవరం ఇంకా ఎక్కడిది అక్కడే ఉందన్నారు. దొంగ ఓట్ల మీద కూడా తాము పోరాటం తీవ్రం చేస్తామన్నారు. దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ప్రశ్నిస్తామన్నారు. ఏపీలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తోందనే ఈనాడును మార్గదర్శిపై కేసులు పెట్టారని విమర్శించారు. 

సిఐడికి మార్గదర్శి చిట్ఫండ్ చందాదారులకు నోటీసులు ఇచ్చే అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి మార్గదర్శిని ప్రశ్నించే హక్కు లేదన్నారు. పద్మవిభూషణ్ గ్రహీత రామోజీరావును గౌరవించుకునే విధానం ఇదేనా అంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.