Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని, అభివృద్దిపై బీఆర్ఎస్ స్టాండ్ క్లియర్.. మరి వాటి సంగతేమిటి..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితిలోకి ఆంధ్రప్రదేశ్‌ నుంచి చేరికలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్‌ వైఖరి ప్రకటించడంతో.. తాము ఏ విధంగా అభివృద్ది చేస్తామని చెప్పడం ద్వారా ప్రజల నుంచి ఆదరణ పొందాలని కేసీఆర్ భావిస్తున్నారు.
 

BRS Party Taken Stand on Amaravati issue and Vizag steel plant
Author
First Published Jan 3, 2023, 5:17 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితిలోకి ఆంధ్రప్రదేశ్‌ నుంచి చేరికలు మొదలయ్యాయి. తొలుత తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి సహా పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇందుకు సంబంధించి తెర వెనక కొంతకాలంగా మంతనాలు సాగినట్టుగా తెలుస్తోంది. అలాగే ఏపీలో పార్టీ విస్తరణకు సంబంధించి కేసీఆర్ ఓ ప్రణాళిక రూపొందించారనే బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్‌ వైఖరి ప్రకటించడంతో.. తాము ఏ విధంగా అభివృద్ది చేస్తామని చెప్పడం ద్వారా ప్రజల నుంచి ఆదరణ పొందాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలోని కొన్ని ప్రధాన అంశాలపై కేసీఆర్ ఓ స్టాండ్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.అయితే మరికొన్ని విషయాలపై మాత్రం బీఆర్ఎస్ వైఖరి ఏమిటనే ఆసక్తి నెలకొంది.

సోమవారం ఏపీ నేతలు బీఆర్ఎస్‌లో చేరిన అనంతరం మాట్లాడిన కేసీఆర్.. దేశం అనేక సమస్యలను ఎదుర్కొంటుందని చెప్పారు. బీఆర్ఎస్ అనేది ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం లేదా ఒక కులం లేదా ఒక మతం కోసం ఉద్దేశించబడలేదని తెలిపారు. ఏపీ ప్రజలు బీఆర్ఎస్‌కు తోడుగా నిలవాలని కోరారు. తమ వెంట నడిచిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. బీఆర్ఎస్‌లో చేరేందుకు ఏపీలో పలు జిల్లాల్లో నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని అన్నారు. సంక్రాంతి తర్వాత బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలు పరుగులు మొదలవుతాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై.. 
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేసీఆర్ తన వైఖరిని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు తాము అనుమతించబోమన్నారు. ‘‘నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానం ప్రైవేటీకరణ. బీఆర్ఎస్ విధానం జాతీయీకరణ. మోడీ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించినా.. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే మళ్లీ జాతీయం చేస్తా’’ అని కేసీఆర్ చెప్పారు. 

ఏపీ రాజధానిపై..
ఏపీ రాజధాని విషయంలో కూడా బీఆర్ఎస్‌ స్టాండ్ క్లియర్‌గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల తాము వైఖరి అని ప్రకటించడంతో.. రాజధాని విషయంలో వివాదం కొనసాగుతుంది. ప్రతిపక్ష పార్టీలు మాత్రం అమరావతే రాజధానిగా ఉండాలనే అంటున్నాయి. అయితే బీఆర్ఎస్‌లో చేరేందుకు కొన్ని గంటల ముందు మీడియాతో మాట్లాడిన రావెల కిషోర్ బాబు.. చరిత్రలో మూడు రాజధానుల నిర్మాణం ఎక్కడా లేదని, ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అద్భుతమైన రాజధాని, సెక్రటేరియట్ నిర్మిస్తామన్నారు. అంటే బీఆర్ఎస్ అమరావతినే రాజధానిగా అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, గతంలో రాజధానిగా అమరావతి శంకుస్థాపకు కేసీఆర్ హాజరైన సంగతి తెలిసిందే.

పోలవరం నిర్మాణంపై.. 
ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో పొరుగు రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇలా అభ్యంతరాలు వ్యక్తం  చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు ప్రమాదముందని గులాబీ పార్టీ నేతలు గతంలో  చెప్పారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించకపోతే భద్రాచలంతో పాటు పరిసర ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కేసీఆర్ ఆంధ్రలోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో.. ఈ విషయంలో బీఆర్ఎస్ వైఖరిపై కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. 

అయితే తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సోమవారం మాట్లాడుతూ.. ఏపీలో బీఆర్ఎస్‌ను గెలిపిస్తే కాళేశ్వరం తరహాలోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు.ఏపీలో పోలవరం పూర్తి కాలేదని, ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు కాలేదని అన్నారు. అయితే కేసీఆర్ ప్రణాళికలను మంత్రి మల్లారెడ్డి వెల్లడించారా?.. లేకపోతే జనరల్‌గా ఈ కామెంట్స్ చేశారా? అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే ఏపీకి పోలవరం ప్రాజెక్టు అనేది అత్యంత కీలకమైన విషయం కావడంతో.. అక్కడి ప్రజలకు అనుగుణంగానే కేసీఆర్ వైఖరి ఉంటుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది.

అభివృద్ది, విభజన సమస్యలు.. 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి 8 ఏళ్లకు పైగానే అయిపోయింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు చాలా వరకు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఎవరి వాదన వారిదే. మరి ఈ విషయంలో కేసీఆర్ ఏ విధంగా వ్యవహరిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే కేసీఆర్ ఈ విషయాల జోలికి పోకుండా.. ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలు, రాష్ట్ర అభివృద్దికి ప్రణాళికలను ప్రజలకు వివరించవచ్చని తెలుస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios