పిల్లలను ఎవరైనా పెద్దవాళ్లు మందలిస్తే కూడా నేటి తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. అలా తన కొడుకును బావమరిది మందలించాడని ఏకంగా హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. 

మేనల్లుడిని ఒక దెబ్బ కొట్టినందుకు ఇద్దరు బావలు కలిసి బావమరిదిని తలపై ఇనుప పైపుతో బలంగా కొట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృత్యువాతపడ్డాడు. 

పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సంతనూతలపాడు మండలం గుమ్మనంపాడుకు చెందిన తాడి చిరంజీవి (30) తలపై తన బావలు వెలుగు శ్రీనివాస్, కోటిలు ఇనుప పైపు తీసుకొని బలంగా బాదారు. 

మంగళవారం సాయంత్రం ఈ సంఘటన జరగగా రాత్రి ఒంటి గంట సమయంలో ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ దాసరి రాజారావు తెలిపారు. మృతదేహాన్ని సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ రాజారావు పరిశీలించారు. మృతుడి భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.