రాజకీయ పార్టీ పెట్టాలనే డిమాండ్ అని సంఘాల నుంచి ఉందని బ్రదర్ అనిల్ కుమార్ చెప్పారు. అయితే పార్టీ ఏర్పాటు సాధారణమైన విషయం కాదని అన్నారు. 

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త, ప్రముఖ క్రైస్తవ మతబోధకులు బ్రదర్ అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌లో వరుస సమావేశాలు నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా బ్రదర్ అనిల్ కుమార్ నేడు విశాఖపట్నంలో బీసీ, ఎస్సీ, మైనార్టీ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రదర్ అనిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విజయానికి కారకులైన వర్గాలకు న్యాయం జరగడం లేదన్నారు. వివిధ సంఘాల ప్రతినిధులు తనతో బాధలు చెప్పుకున్నారని.. వాళ్ల బాధలు వినేందుకు ఉత్తరాంధ్రకు వచ్చానని చెప్పారు. 

రాజకీయ పార్టీ పెట్టాలనే డిమాండ్ అని సంఘాల నుంచి ఉందని చెప్పారు. అయితే పార్టీ ఏర్పాటు సాధారణమైన విషయం కాదని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఎం జగన్‌ను కోరతానని చెప్పారు. సీఎం జగన్ చాలా బిజీగా ఉంటున్నారు.. కలిసి రెండున్నరేళ్లు అయిందని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పారు. సీఎం జగన్‌ను తాను నేరుగా కలవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. తనను కలిసినవాళ్లకు సాయం చేస్తానని హామీ ఇచ్చానని.. మాట ఇస్తే కచ్చితంగా వెనక్కి తగ్గకుండా నిలబడతానన్నారు. 

ఇక, గత నెలలో బ్రదర్ అనిల్ కుమార్.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. మా సీక్రెట్‌లు మాకు ఉంటాయని.. అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తాయి అని బ్రదర్ అనిల్ వ్యాఖ్యానించారు. హిందూ మతోన్మాదం ఈ మధ్య పెరిగిందని.. తాను ఏసుప్రభుని నమ్ముకున్నానని.. దేవుడు చెప్పకుండా ఏ పని చేయనని అనిల్ పేర్కొన్నారు. 

ఇక, వారం రోజుల క్రితం విజయవాడలోని ఓ హోటల్‌లో బీసీ, మైనారిటీ, క్రిస్టియన్‌ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీ వేదిక‌గా తాము కొత్త పార్టీ పెడుతున్నామ‌న్న విషయం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఏపీ సీఎం జగన్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం పని చేసిన క్రైస్తవులు, ఎస్సీలు ఇప్పుడు తీవ్ర ఆవేదనతో ఉన్నారని.. ఇటీవల తనతో సమావేశమైన కొందరు క్రైస్తవులు ఈ విషయం తనకు చెప్పారని బ్రదర్ అనిల్ వెల్లడించారు. ఇక, ప్రస్తుత పరిస్థితుల్లో బ్రదర్ అనిల్ వరుస సమావేశాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.