ప్రియురాలు తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసకుంటుందన్న అక్కసుతో దారుణానికి తెగబడ్డాడో ప్రియుడు. తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను కాబోయే భర్తకు పంపాడు. దీంతో.. 

ద్వారకాతిరుమల : ప్రియురాలి వివాహాన్ని చెడగొట్టేందుకు ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు, చాటింగ్, వాయిస్ మెసేజ్ లను కాబోయే భర్తకు వాట్సాప్ లో పంపాడు ఆమె ప్రియుడు. దీంతో మనస్తాపానికి గురైన నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జాజులకుంట గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకోగా బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. జాజులకుంటకు చెందిన బత్తుల అలేఖ్య (24) ఇంటి వద్ద ఉంటూ ప్రైవేటుగా చదువుకుంటుంది.

రెండేళ్ల క్రితం ఆమె డీఎడ్ చదువుతుండగా నల్లజర్లకు చెందిన కారు డ్రైవర్ బైపే రవితేజతో ప్రేమలో పడింది. ఇంట్లో విషయం తెలియడంతో ఈ నెల ఒకటిన కొయ్యలగూడెం మండలం రాజవరంకి చెందిన ముంగమూరి బుచ్చిబాబుతో ఆమె పెళ్ళికి కుదిర్చారు. ఈ నెల 4న నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ నెల 8 న బుధవారం భోజనాలు, 9న గురువారం వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలిసిన ప్రియుడు రవితేజ ఈ వివాహాన్ని చెడగొట్టాలని భావించి తనతో అలేఖ్య సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు, చాటింగ్, వాయిస్ మెసేజ్ లను అతడి స్నేహితుడు మరై సెల్ ఫోన్ నుంచి పెళ్ళికొడుకు ఫోన్ కు వాట్సప్ ద్వారా ఈ నెల 7న పంపాడు. 

దీంతో మనస్తాపం చెందిన అలేఖ్య ఇంట్లోని బెడ్ రూంలోకి వెళ్లి ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకుంది. కొద్దిసేపటికి కుటుంబ సభ్యులు గుర్తించి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు రవితేజ, సునీల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ టి. సుధీర్ తెలిపారు.

ఇదిలా ఉండగా, Shamshabadలో అడ్డా నుంచి మహిళా కూలీని పని ఉందని చెప్పి.. తీసుకువెళ్ళిన కామాంధులు ఆమెపై molestationకి పాల్పడడంతో పాటు.. అంతమొందించే ప్రయత్నం చేశారు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాధితురాలు మృత్యువాత పడింది. ఈ దారుణం శంషాబాద్ మండల పరిధిలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మదనపల్లి తండాకు చెందిన ఓ మహిళ (40) దినసరి కూలీ. రోజులాగానే బుధవారం ఉదయం శంషాబాద్ లోని అడ్డా దగ్గర నిలబడింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు work ఉందంటూ ఆమె ను పిలిచారు.

ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని కవ్వ గూడ వ్యవసాయ పొలాల్లోని నిర్జన ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. ఆ తరువాత బండరాయితో తలపై మోది పరారయ్యారు. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని స్థానిక రైతులు గమనించి 100కు సమాచారం అందించారు. ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృత్యువాత పడిందని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బాధితురాలి భర్త ఎనిమిదేళ్ల క్రితం మరణించాడు. ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడుని బాధితురాలు తన రెక్కల కష్టంతో పోషిస్తుంది. చిన్న కుమార్తెకు మూడు నెలల క్రితం వివాహం చేసింది. కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు.