వారిద్దరూ ఒకరిని మరొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అయితే... వారి పెళ్లిని పెద్దలు అంగీకరించలేదు. దీంతో వారిని కాదని మరీ ఇంట్లో నుంచి పారిపోయారు. తర్వాత ఇంటికి చేరి పెద్దలకు నచ్చచెప్పారు. 

వాళ్లని ఒప్పించి మూడు మూళ్లు, ఏడు అడుగులతో ఒక్కటయ్యారు. వారు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టి కనీసం ఆరు నెలలు కూడా కాకముందే ఆమె ఆశలన్నీ కల్లలయ్యాయి. భర్త చేసిన ఓ పని కారణంగా ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా హిరమండలం పెద్దకిట్టాలపాడు గ్రామానికి చెందిన ఝాన్సీ(19) టెక్కలికి చెందిన సాయితేజ ఒకరిని మరొకరు ప్రేమించుకున్నారు. వారి ప్రేమ ఇంట్లో తెలిసి పెద్దలు అంగీకరించలేదు. దీంతో... ఇంట్లో నుంచి కొద్ది రోజులు పారిపోయారు. తర్వాత తిరిగి ఇంటికి వచ్చారు.

Also Read సైనైడ్ ఇచ్చి భార్యను చంపిన బ్యాంక్ మేనేజర్: డ్రామా చేశాడు...

పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి జరిగి ఆరునెలలు కావస్తోంది. అయితే.. పెళ్లి జరిగినా కూడా సాయితేజ బాధ్యత తెలుసుకోలేదు. ఖాళీగా తిరుగుతూ జల్సా చేస్తూ ఉండేవాడు. సాయి తేజ తండ్రి ఆటో డ్రైవర్. అతని సంపాదన మీదే కుటుంబం నడుస్తోంది. కొడుకు తండ్రికి సహాయం చేయకపోగా.. పెళ్లిపేరిట మరో వ్యక్తిని ఇంటికి తీసుకువచ్చాడు. దీంతో ఖర్చులు మరింత పెరిగాయి. ఈ క్రమంలో ఆ తండ్రీ, కొడుకుల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి.

ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం ఝాన్సీ మెడలో తాళి తీసుకొని సాయితేజ ఇంట్లో నుంచి పరారయ్యాడు. దీంతో మనస్థాపానికి చెందిన యువతి ఎవరూలేని సమయంలో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.