సహ జీవనం చేస్తున్న జంట మధ్యలో అనుమానం భూతం చిచ్చు పెట్టి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బాసగిట్టంగి గ్రామానికి చెందిన కె. శాంతి, పక్క గ్రామం పెదగిట్టంగి గ్రామానికి చిన్నారావులు ఏడు నెలల క్రితం చిప్పాడ దివీస్ కంపెనీలో రోజువారీ కూలీలుగా చేరారు.

వీరిద్దరూ ఫ్యాక్టరీకి సమీపంలోని రేకుల షెడ్డులో సహజీవనం చేస్తూ నివసిస్తున్నారు. ఈ నెల 25న ఎప్పటిలాగానే విధులకు వెళ్లారు.. అక్కడ వీరిద్దరికి ఘర్షణ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శాంతి షెడ్డుకి వెళ్లిపోయింది..

కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన చిన్నారావు ఆమెను నోటికి వచ్చినట్లు తిట్టాడు. దీంతో నేను నిన్ను పెళ్లిచేసుకోను.. నన్ను కొడుతున్నావంటూ అనడంతో అతను కోపంతో ఊగిపోయాడు.

శాంతిపై పిడిగుద్దులు గుద్ది, అనంతరం గొంతు నులిమి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చిన్నారావును అదుపులోకి తీసుకున్నారు. శాంతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.