కారులో ఊపిరాడక మరో బాలుడు కన్నుమూశాడు. ఇటీవల విశాఖపట్నంలో ఓ బాలుడు కారులో ఆడుకుందామని వెళ్లి... ఊపిరాడక మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా... తాజాగా అలాంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. కారులోకి వెళ్లి తలుపులు వేసుకున్న ఏడేళ్ల బాలుడు సాయిబాబా ఊపిరి ఆడక మృతిచెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో సోమవారం జరిగింది. 

గ్రామానికి చెందిన కళ్లేపల్లి రాధా కుమార్తె లక్ష్మికి దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన అనిశెట్టి శ్రీనివాసరావుతో వివాహం జరిపించారు. వారికి ఇద్దరు పిల్లలు. సాయిబాబా (7), రెండేళ్ల కుమార్తె వైసు ఉన్నారు. శ్రీనివాసరావు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో లక్ష్మి ఇద్దరు పిల్లలతోపాటు దొమ్మేరులో తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు.

సోమవారం సాయిబాబా ఆడుకుంటూ అక్కడ పార్క్‌ చేసి ఉన్న కారులోకి ఎక్కాడు. డోర్‌ వేసుకోవడంతో లాక్‌పడింది. కొంతసేపటికి ఊపిరి ఆడక మృతిచెందాడు. సాయంత్రం కారు వద్దకు వచ్చి డోర్‌ తీసిన యజమాని లోపల బాలుడు మరణించి ఉండటాన్ని గుర్తించారు. చిన్నారి మరణంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.