Asianet News TeluguAsianet News Telugu

తండ్రీకొడుకు చెరొక అగ్గిపెట్టె పట్టుకొని కుట్రలు..: బొత్స సంచలనం

తండ్రి చంద్రబాబు ఆక్సిజన్ అందలేదంటూ లేనిపోని ఆరోపణలు చేస్తుంటే... కొడుకు లోకేష్ విద్యార్థులను రెచ్చగొట్టాలని చూస్తున్నాడని మంత్రి బొత్స ఘాటుగా విమర్శలు చేశారు. 
 

Botsa Satyanarayana Serious Comments on Chandrababu lokesh akp
Author
Amaravathi, First Published Apr 26, 2021, 8:06 PM IST

అమరావతి: కరోనా విపత్కర సమయంలోనూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ బాధ్యతారాహిత్యంతో రాజకీయం చేస్తోందని రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.  ప్రజల్లో టీడీపీ బ్రతికి ఉందని చెప్పటానికి అవకాశం లేదు కాబట్టే.. తండ్రీకొడుకు కలిసి చెరొక అగ్గిపెట్టె పట్టుకొని ఎక్కడ నిప్పు పెడదామా అని రగిలిపోతున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే తండ్రి ఆక్సిజన్ అందలేదంటూ లేనిపోని ఆరోపణలు చేస్తుంటే... కొడుకు విద్యార్థులను రెచ్చగొట్టాలని చూస్తున్నాడని చంద్రబాబు, లోకేష్ లపై మంత్రి బొత్స ఘాటుగా విమర్శలు చేశారు. 

కరోనా సంక్షోభంలోనూ ప్రతిపక్ష తెలుగుదేశం తమ పార్టీ ఉనికి కోసమే రాజకీయాలు చేస్తుంది తప్ప వారికి ప్రజల ప్రాణాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని బొత్స ధ్వజమెత్తారు. చివరికి ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా చంద్రబాబు, లోకేష్‌ మాట్లాడుతూ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 
 
''దేశంలో ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడిన సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా స్పందిస్తారు. వచ్చిన ఆపదను అందరూ కలిసి ఎదుర్కొంటారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా వున్న తెలుగుదేశం కరోనా సంక్షోభాన్ని కూడా తన రాజకీయం కోసం వాడుకుంటోంది. కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న ప్రభుత్వంపైనా, ప్రజలకోసం ప్రాణాలొడ్డి నిరంతరం పనిచేస్తున్న ఉద్యోగులపైనా ఇష్టారాజ్యంగా చంద్రబాబు, లోకేష్, టిడిపి నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు'' అని మండిపడ్డారు.

read more   ఏ వేడుకైనా 50 మంది దాటొద్దు: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

''ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం ఘోరంగా ఓటమి పాలయ్యింది. దానిని జీర్ణించుకోలేక, అసహనంతో ఈ ప్రభుత్వంపైనా, సీఎం వైయస్ జగన్ పైనా ఏదో ఒక రకంగా బురదచల్లాలనే లక్ష్యంతో తెలుగుదేశం ఆరోపణలు చేస్తోంది. ఆక్సీజన్ లేదని, విద్యార్ధులకు పరీక్షలు రద్దు చేయాలంటూ రెచ్చగొట్టే రాజకీయం చేస్తోంది. మరోవైపు ఉద్యోగుల్లో అపోహలు కలిగించేలా చంద్రబాబు, లోకేష్, టిడిపి నేతలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా, ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం జగన్ చిత్తశుద్దితో, నిబద్ధతతో తన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు'' అని పేర్కొన్నారు. 

''కోవిడ్ పై  రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులు యుద్దం చేస్తున్నారు. ప్రతినిత్యం సీఎం జగన్ కరోనా పరిస్థితులను సమీక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులను, ఉద్యోగులను ముందుకు నడిపిస్తున్నారు. కరోనా పేషంట్లకు కావాల్సిన బెడ్లు, కోవిడ్ కేర్ సెంటర్లు, మందులు, ఇంజెక్షన్లు, ఆక్సీజన్ ఇలా ప్రతి అంశంపైన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 104 సెంటర్‌ ను పటిష్టం చేయడం ద్వారా కాల్ చేసిన రెండుమూడు గంటల్లోనే ఎక్కడ ఖాళీ బెడ్లు వున్నాయో పరిశీలించి, పేషంట్లను అక్కడికి పంపుతున్నాము. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి, సీనియర్‌ అధికారులను ఇన్‌చార్జీలుగా పెట్టాం. ఆరోగ్యశాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్‌ తదితర శాఖలు అన్ని సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నాయి. ప్రత్యేకంగా వైద్య అధికారులు నిరంతరం శ్రమిస్తూ, పేషంట్లకు సేవలు అందిస్తున్నారు. కరోనా బారిన పడిన వారికి ఆత్మస్థైర్యం కల్పిస్తున్నారు'' అని తెలిపారు. 

''కరోనా పై జరుగుతన్న ఈ పోరులో ఉద్యోగులు సైనికులుగా ముందుండి పనిచేస్తున్నారు. ఈ సమయంలో వారి ఆత్మస్థైర్యంను దెబ్బతీసేలా చంద్రబాబు, లోకేష్ మాట్లాడటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ప్రజలను కాపాడే విషయంలో సైనికులుగా పనిచేస్తున్న వారిని వెన్నుతట్టి అభినందించాల్సిన కనీస బాధ్యత ప్రతిపక్షంగా తెలుగుదేశంకు లేదా? ఇదేనా చంద్రబాబు రాజకీయ పరిణితి? ఈ ప్రభుత్వంపైన కడుపుమంటతోనే చంద్రబాబు ఉద్యోగుల్లో అలజడి సృష్టించేందుకు మాట్లాడుతున్నాడు'' అని అన్నారు. 

''విజయనగరం జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘటనతో జిల్లా కలెక్టర్ నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధుల వరకు వెంటనే ఆ ఘటనపై స్పందించారు. ఆక్సీజన్ అవసరమైన పేషెంట్లను తక్షణం ఇతర ఆసుపత్రులకు తరలించడం, ఇరవై మందిని అంబులెన్స్‌లో ఆక్సీజన్ అందించి కాపాడటం చేశారు. ప్రతిక్షణం అమూల్యమైనదిగా డాక్టర్లు, సిబ్బంది పనిచేశారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఎంతో నిబద్ధత, చిత్తశుద్దితో పనిచేశారు. అటువంటి వారిని కనీసం అభినందించాల్సిన అవసరం ప్రతిపక్ష పార్టీకి లేదా? దానికి బదులు ఈ ప్రభుత్వం చేతులెత్తేసిందంటూ తప్పుడు మాటలు మాట్లాడతారా?" అని బొత్స మండిపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios