విజయనగరం: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. 

పచ్చ నేతలకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని, చిన్న చిన్న సంఘటనలను చూపించి ప్రయోజనం పొందాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని బొత్స చంద్రబాబుపై మండిపడ్డారు.

చంద్రబాబు ఎంత రెచ్చగొట్టినా తాము సంయమనం పాటిస్తామని బొత్స చెప్పారు. చంద్రబాబు తానా అంటే పవన్ కల్యాణ్ తందానా అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి పట్టం కట్టడం ఖాయమని ఆయన అన్నారు. 

గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు రాష్ట్రాన్ని ఊబిలోకి నెట్టారని ఆన అన్నారు. చంద్రబాబుకు విలువలు, సిద్ధాంతాలు లేవని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని చెప్పారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా జగన్ ధైర్యంతో ముందుకు వెళ్తున్నారని ఆయన అన్నారు.