ట్రంప్ విందుకు జగన్ కు రాని ఆహ్వానం: చంద్రబాబు వ్యాఖ్యలకు బొత్స కౌంటర్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానం అందకపోవడంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విందుకు ఆహ్వానించకపోవడంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఆర్థి నేరస్థుడు కావడం వల్లనే వైఎస్ జగన్ ను విందుకు ఆహ్వానించలేదని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా ఆహ్వానించలేదని ఆయన బుధవారం మీడియా సమావేశంలోచెప్పారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్ ను ఆహ్వానించకపోయినా మిగిలినవారు రెండు మూడు సార్లు సీఎంలు అయినవారేనని, మరి వారిని ఎందుకు ఆహ్వానించలేదని ఆయన అన్నారు.
Also Read: ట్రంప్ విందుకు జగన్ కు రాని ఆహ్వానం: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
జగన్ ను ట్రంప్ విందుకు ఆహ్వానించకపోవడంపై ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాయని ఆయన అన్నారు. భూసేకరణ, భూ సమీకరణ పేదల కోసం మాత్రమేనని, టీడీపీలా దోచుకోవడానికి కాదని ఆయన అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రగల్భాలు పలకడమేనా, పనిచేయడం ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రజల్లో చైతన్యం ఉంది కాబట్టే చంద్రబాబును చిత్తుగా ఓడించి వైఎస్ జగన్ ను గెలిపించారని ఆయన అన్నారు. ల్యాండ్ పూలింగ్ పై విశాఖ వస్తానని చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు జిల్లాకు వస్తే టీడీపీ నాయకులు ఎలా దోచుకున్నారో ప్రజలు చెబుతారని ఆయన అన్నారు.
Also Read: చంద్రబాబు ఓటమి ట్రంప్ కు కోపం తెప్పించిందా...అందుకే జగన్ కు..: కన్నబాబు
చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తే ఆ తర్వాత టీడీపీకి ఉన్న కాస్తా గౌరవం, టీడీపీపై ఉన్న కాస్తా విశ్వాసం కూడా పోవడం ఖాయమని ఆయన అన్నారు. భూసేకరణలో ప్రజలు అసంతృప్తిగా ఉంటే ఒక్క రూపాయి ఎక్కువైనా ఇచ్చి వారిని సంతృప్తిపరచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పినట్లు బొత్స తెలిపారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరిగిందని, ప్రకృతి కూడా బాగా సహకరించి పంటలు సమృద్ధిగా పండాయని ఆయన చెప్పారు. మళ్లీ వైఎస్ జగన్ పాలనలో వర్షాలు పడి మంచి ఫలసాయం వచ్చిందని చెప్ాపరు .విజయనగరం జిల్లా ప్రజలు చైతన్యవంతులు కాబట్టి వైసీపీకి 9 సీట్లు కట్టబెట్టారని ఆయన అన్నారు.