భార్య ఒత్తిడితో ఇంటికి: మళ్లీ అజ్ఞాతంలోకి ఆనందయ్య, ఆయన భార్య తరలింపు
కరోనా మందును తయారు చేసే బొనిగె ఆనందయ్యను మళ్లీ అజ్ఞాతంలోకి తరలించారు. ఈసారి ఆయనతో పాటు ఆయన భార్యను కూడా అజ్ఞాతంలోకి తరలించారు. నిన్న రాత్రి ఆయనను ఇంటికి తీసుకుని వచ్చారు.
నెల్లూరు: కరోనా మందు ఇస్తున్న బొనిగె ఆనందయ్యను ఇంటికి పంపించినట్లే పంపించి మళ్లీ అజ్ఞాతంలోకి తరలించారు. భార్య ఒత్తిడితో ఆయనను పోలీసులు ఇంటికి తీసుకుని వచ్చారు. అయితే, శనివారం తెల్లవారు జామున ఆయనతో పాటు ఆయన భార్యను కూడా అజ్ఞాతంలోకి తరలించినట్లు తెలుస్తోంది.
వారిని సీవీఆర్ అకాడమీకి తరలించినట్లు చెబుతున్నారు. తీవ్ర ఒత్తిళ్ల కారణంగా ఆనందయ్య ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆనందయ్యను తిరిగి అజ్ఞాతంలోకి తరలించడంపై కృష్ణపట్నం గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఇంటికి చేరుకున్న ఆనందయ్య.. మందు పంపిణీకి దక్కని అనుమతి
కాగా, ఆనందయ్య కరోనా మందుకు సీసీఆర్ఎఎస్ నుంచి సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. విజయవాడ పరిశోధన కేంద్రం ఆ సంస్థకు నివేదిక పంపిందని, దాంతో ఆనందయ్య కరోనా మందుకు అనుమతి లభిస్తుందని అంటున్నారు.
ఆనందయ్య మందు తీసుకున్న 570 మంది నుంచి పరిశోధన కేంద్రం వివరాలు అడిగి తెలుసుకుంది. మందు వల్ల వారిపై ఏ విధమైన ప్రతికూల ప్రభావం పడలేదని తెలిసింది. ఆనందయ్య మందుకు అనుమతి లభిస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పంపిణీ జరిగే అవకాశం ఉంది.
ఈ నెల 21వ తేదీన ఆనందయ్య చివరసారి కరోనా మందు పంపిణీ చేశారు. అప్పటి నుంచి ఆయన పోలీసుల రక్షణలోనే ఉన్నారు. ఇంటికి రాలేదు. అయితే, భార్య ఒత్తిడితో శుక్రవారంనాడు ఆయనను ఇంటికి తీసుకుని వచ్చారు. అయితే, శనివారం తెల్లవారు జాముననే ఆయనను మళ్లీ అజ్ఞాతంలోకి తరలించారు.