Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు, లోకేశ్ కాదు..టీడీపీ ఆఫీస్ బాయ్ చాలు : శ్రీకాంత్ రెడ్డి సవాల్ పై బోండా కౌంటర్

స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల చరిత్రలో వైకాపా లాంటి అసమర్థ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నడూ చూడలేదని టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. 

bonda uma strong counter on gadikota srikanth reddy challenge
Author
Vijayawada, First Published Jun 6, 2020, 7:23 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విజయవాడ: స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల చరిత్రలో వైకాపా లాంటి అసమర్థ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నడూ చూడలేదని టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. పాలన చేతగాక ఏడాది పాటు రాష్ట్రంలో విధ్వంసకాండ సృష్టించారని... వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని అన్నారు. మంత్రి పదవి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డికి బాకాలు ఊదే వ్యక్తి గడికోట శ్రీకాంత్ రెడ్డి అని... ఆయన వైసిపి ఏడాది పాలనపై విసిరిన సవాల్ కు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా వుందన్నారు. 

''వైసిపి అధికారంలోకి వచ్చిన వెనువెంటనే రూ. 10 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడం విధ్వంసం కాదా..? విభజన సమయంలో రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్, రూ. లక్ష కోట్ల అప్పు, 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటుతో నవ్యాంధ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో సమర్థ నాయకత్వంతో 5 ఏళ్లలో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా చంద్రబాబు నిలిపారు'' అని పేర్కొన్నారు. 

''రాజధాని అమరావతికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి.. అధికారంలోకి రాగానే పనులన్నీ నిలిపివేశారు. వడ్డించిన విస్తరించిన లాంటి రాష్ట్రాన్ని, అమరావతిని జగన్మోహన్ రెడ్డికి అప్పజెపితే కుక్కలు చింపిన విస్తరిని చేశారు. ఒక్క రాజధానిని కట్టడం చేతగాని మీరు మూడు రాజధానులు కడతామని చెప్పడం హాస్యాస్పదం'' అన్నారు. 

''విశాఖలో వైకాపా నాయకులు కొన్న 30వేల ఎకరాల భూముల ధరలు పెంచుకోవడం కోసం రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారు. అసైన్డ్ భూములు, ప్రభుత్వ స్థలాలు, మాన్సాస్ ట్రస్ట్ భూములు, దసపల్లా భూములను ఇష్టారీతిగా ఆక్రమించుకుంటున్నారు'' అని ఆరోపించారు. 

''తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధిపై రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అయినా బహిరంగ చర్చకు సిద్ధం. ఒక్క కుప్పమే కాదు సీఎం జగన్ రెడ్డి నివాసం ఉంటున్న తాడేపల్లిలోనైనా చర్చకు సిద్ధం'' అని అన్నారు. 

read more  లారీ ఓనర్ల ధర్నా, ఉద్రిక్తత: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఛీటింగ్ కేసు

''పాదయాత్రలో కులానికి, ప్రాంతానికి చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పారు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువత కోసం తెలుగుదేశం ప్రభుత్వం అందించిన రూ.2వేల భృతిని రద్దు చేసి యువతను వంచించారు. పేద యువతుల పెళ్లికి చంద్రన్న అందించిన రూ. లక్ష పెళ్లి కానుకను రద్దు చేశారు. పేదలకు రూ. 5 కే అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను రద్దు చేసి వారి పొట్టకొట్టారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన అసంఘటిత కార్మికుల కుటుంబాలకు చంద్రన్న అందించే రూ. 5 లక్షల చంద్రన్న బీమాను కక్షపూరితంగా రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ భజన బృందం కోటరిగా చేరి.. సెటిల్మెంట్లు, మాఫియాలు నడుపుతూ రాష్ట్రాన్ని ఇష్టారీతిన దోచుకుంటున్నారు'' అని మండిపడ్డారు. 

''డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి 90 లక్షల మంది మహిళలను మోసగించారు. ఏడాదిలో కనీసం ఒక్క రూపాయి కూడా వారి ఖాతాల్లో వేయలేకపోయారు. అదే చంద్రబాబు గారి హయాంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రూ. 20వేల కోట్లు డ్వాక్రా ఖాతాలలో వేసి వారిని ఆదుకోవడం జరిగింది. రాష్ట్రంలో 83 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. కేవలం 42 లక్షల మందికి మాత్రమే అమ్మఒడి ఇచ్చారు. ఆ మొత్తాన్ని కూడా నాన్న బుడ్డి పేరుతో లాగేసుకున్నారు'' అని ఎద్దేవా చేశారు. 

''తెలుగుదేశం హయాంలో రూ. 200 ఉన్న పెన్షన్ ను పది రెట్లు పెంచి రూ. 2వేలు చేయడం జరిగింది. పెన్షన్ ను రూ. 3వేలు చేస్తానని హామీనిచ్చిన జగన్ రెడ్డి కేవలం రూ. 250 పెంచి చేతులు దులుపుకున్నారు. రాష్ట్రంలో 6 లక్షల ఆటోలు, 3 లక్షల ట్యాక్సీలు రిజిస్టర్ అయి ఉంటే కేవలం 2.26 లక్షల మందికి మాత్రమే సాయం అందించి అర్హులకు పథకాన్ని దూరం చేశారు. పాదయాత్రలో ప్రతి ఒక్క టైలర్ ను ఆదుకుంటామని హామీనిచ్చి... అధికారంలోకి వచ్చాక ట్రేడ్ లైసెన్స్ ఉంటేనే సాయం అందిస్తామని ఆంక్షలు విధిస్తున్నారు''  అని అన్నారు. 

''మరోవైపు వైకాపా ప్రభుత్వ ఆర్భాటపు ప్రచారానికి మాత్రం రూ.వందల కోట్లు వృధా ఖర్చు చేస్తున్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారు. మాస్కులు లేవని అడిగినందుకు డాక్టర్ ను పిచ్చివాడిని చేశారు. మరో 20 ఏళ్ల వరకు కోలుకోలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. రాష్ట్రాన్ని అధ: పాతాళానికి నెట్టివేశారు. టీటీడీ ఆస్తులను, సింహాచలం అప్పన్న భూములను, శ్రీశైలం పుణ్య క్షేత్ర నిధులను ఇష్టారీతిన దోచేస్తున్నారు. హిందూ దేవాలయాల ఆస్తులను జీవోలతో వైకాపాకు అనుకూలంగా వ్యవహరించే స్వామీజీలకు కట్టబెడుతున్నారు'' అని ఆరోపించారు. 

''ఇటువంటి వైకాపా విధ్వంస పాలనపై గడికోట శ్రీకాంత్ తో చర్చించడానికి చంద్రబాబునాయుడు, నారా లోకేష్ వరకు అవసరం లేదు, టీడీపీ కార్యాలయంలో పనిచేసే ఆఫీస్ బాయ్ చాలు. కనుక ఇప్పటికైనా వైకాపా నాయకులు ఉత్తరకుమార ప్రగల్బాలను, చేతగాని సవాళ్లను మానుకోవాలి'' అని శ్రీకాంత్ రెడ్డిని బోండా ఉమ సూచించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios