విజయవాడ: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కొట్టేయడానికి తెరవెనుక రంగం సిద్ధంచేసుకున్న సీఎం జగన్, తెరముందు మాత్రం కేంద్రానికి లేఖలు రాశానంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. 2019 అక్టోబర్ 29న జగన్ తననివాసంలో దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీతో చర్చలు జరిపాడని... రూ.2లక్షలకోట్ల విలువైన ఉక్కు కర్మాగారాన్ని రూ.5వేలకోట్లుకు కొట్టేసేలా సదరు కంపెనీ ప్రతినిధులతో బేరసారాలు జరిపాడని ఆరోపించారు. 

''జగన్ చర్చల వ్యవహారం కేంద్రపెద్దలకు ముందే తెలుసు. దానికనుగుణంగానే పార్లమెంట్ లో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఫ్రకటన కేంద్రప్రభుత్వం నుంచి వెలువడింది. కేంద్రం ప్రకటించాక తనకేమీ తెలియనట్లు జగన్ లేఖలు రాస్తుంటే, వైసీపీ ఎంపీలు తమకేమీ తెలియదన్నట్లు నిమ్మకునీరెత్తినట్లుగా కూర్చున్నారు.  జగన్మోహన్ రెడ్డికి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధం లేకుంటే, ఆయన తక్షణమే తనపార్టీకి చెందిన 28మంది ఎంపీలతో రాజీనామాలు చేయించి, వారంతా  కేంద్రంపై పోరాడేలా చూడాలి'' అని సూచించారు.

విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ: అసెంబ్లీలో తీర్మానం చేయాలని గంటా డిమాండ్

''విశాఖ ఉక్కుఫ్యాక్టరీని రక్షించుకోవడానికి కార్మికుల ఆందోళన చేస్తుంటే, జగన్ ఒక్కనాడైనా వారి ముందుకువెళ్లి నేనున్నాను అనే భరోసా వారికి ఎందుకు ఇవ్వలేకపోయాడు?  విశాఖ ఉక్కుఫ్యాక్టరీకి మద్ధతుగా వైసీపీ ఎంపీలు రాజీనామాలుచేస్తే, అదేబాటలో టీడీపీ ఎంపీలు కూడా నడుస్తారు'' అన్నారు.

''విశాఖ ఉక్కుఫ్యాక్టరీపై టీడీపీ ఏంచేసిందనే వారికి 1998లో, 2000లో టీడీపీ ఎంపీలు పార్లమెంట్ కేంద్రంగా చేసిన డిమాండ్లే సమాధానం చెబుతాయి.  పలుసందర్భాల్లో ఆనాటి టీడీపీ ఎంపీ ఎర్రన్నాయుడు, ఎంవీవీఎస్ మూర్తి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయొద్దని, కార్మికులను ఆదుకోవాలని, కర్మాగారానికి ఇచ్చిన రుణాలను ఈక్విటీలుగా మార్చాలని, సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు'' అని గుర్తుచేశారు. 

''విషయాలు తెలుసుకోకుండా వైసీపీ నేతలు టీడీపీపై నిందలేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వ దొంగనాటకాలను ప్రజలముందు ఎండగడుతూనే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు టీడీపీ పోరాటం చేస్తుంది'' అని బోండా వెల్లడించారు.