విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ: అసెంబ్లీలో తీర్మానం చేయాలని గంటా డిమాండ్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
సోమవారం నాడు ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకొన్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని సీఎం జగన్ ప్రధానితో మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. తన రాజీనామా స్పీకర్ ఫార్మెట్ లో లేదని వైఎస్ఆర్‌పీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అధికార పార్టీ నేతలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.ఈ విషయమై కేంద్రంపై వైసీపీ నేతలు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.
విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని గంటా శ్రీనివాసరావు ఆదివారం నాడు ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.