గోదావరి నదిలో లాంచీ మునక: 50 మంది గల్లంతు?

Boat accident in Godavari river
Highlights

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు వద్ద గోదావరిలో లాంచీ మునిగింది.

కాకినాడ:  తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు వద్ద గోదావరిలో లాంచీ మునిగింది. సుడిగాలిలో చిక్కుకుని లాంచీ మునిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో లాంచీలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

ప్రయాణికుల్లో 15 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నట్లు సమాచారం.  దాదాపు 50 మంది గల్లంతయినట్లు చెబుతున్నారు. గోదావరి నదిలో గల్లంతైన లాంచీని పోలీసులు గుర్తించారు. మంటూరు దగ్గర నీటిలోమునిగిన లాంచీని ఎన్టీఆర్‌ఎఫ్‌, పోలీస్‌ బృందాలు వెలికితీస్తున్నాయి.  గల్లంతైన వారికోసం ప్లడ్‌లైట్ల వెలుగులో గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. 
 
దేవిపట్నం దగ్గర పడవ మునకపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స‌హాయ‌క చ‌ర్యలు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు ఆయన ఆదేశించారు. జిల్లా అధికారుల‌తో మాట్లాడి ప్రమాద వివ‌రాల‌ను ఆయన తెలుసుకున్నారు. బాధితుల‌కు ప్రభుత్వ సాయం అంద‌జేయాల‌ని చంద్రబాబు ఆదేశించారు. .
 
పెళ్లి బృందంతో వెళ్తున్న లాంచీ మునిగిపోయిందని కొందరు చెబుతుండగా మరికొందరేమో సిమెంట్ బస్తాలు ఉండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెబుతున్నారు. అయితే గల్లంతైనవారంతా చనిపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. 

ఈదురు గాలులు, వర్షం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. పడవ 75 అడుగుల లోతులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంత మంది గల్లంతయ్యారనేది ఇప్పుడే చెప్పలేమని జిల్లా కలెక్టర్ చెప్పారు. పడవ మునకపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు.

loader